జూబిలీ హిల్స్ అసెంబ్లీ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతం — వర్షాలు పడితే నీళ్లు నిలిచి, దోమలు, పురుగులు కాటుకు చిన్న పిల్లలూ కూడా భయంతో గడిపే పరిస్థితులు. ఇళ్లలో నీరు, బయట గుంతలు… ఇదే ఈ ప్రాంతం యొక్క నిత్యచిత్రం. అధికారాలు మారినా, సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని ప్రజలు చెబుతున్నారు.
స్థానికులు తమ బాధను ఇలా వ్యక్తం చేశారు:
“వర్షం వస్తే ఇళ్లలో నీళ్లు… నీటిలోనే వండి తింటాం. పిల్లలు కూడా అదే నీటిలో ఉంటారు.”
ఒక చిన్నారి చెప్పిన మాటలు మరింత హృదయ విదారకంగా ఉన్నాయి:
“నీళ్ళలో నిద్రపోతాం. దోమలు కుడతాయి. స్కూల్‌కి కూడా వెళ్లలేం… ఫీజులు కూడా కట్టాలి.”
ఇంకో మహిళ ఆవేదనతో అన్నారు:
“బస్సు ఫ్రీ తప్ప ఏ సాయం లేదు. డబుల్ బెడ్రూం లేదు, 2500 లేదు. మేము 30 ఏళ్లుగా ఇక్కడే. ఒక గంటైనా వచ్చి ఉండమంటే నాయకులు రారు.”
ప్రజలు రాజకీయ నాయకుల మాటలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు:
“ఎన్నికల సమయంలో వస్తారు, మిగతా సమయాల్లో కనిపించరు. ఈసారి ఓట్లు అడిగితే ముందుగా మా ఇళ్లలో ఒక గంట కూర్చోమన్నా చూడాలి.”
బాలుడు మరొక వ్యాఖ్యతో రాజకీయ ఉద్రిక్తతను ప్రతిబింబించాడు:
“కేసీఆర్ మంచోడు. రేవంత్ చేయడం లేదు.”
షేక్‌పేట్ ప్రజలు ఉపఎన్నికల దశలో ఉన్నప్పటికీ, వారి ఆసక్తి నాయకుల దర్శనంలో కాదు — వారి గల్లీకి రక్షణ, మురుగు శుద్ది, నీరు నిల్వలు తొలగింపు, దోమల నియంత్రణలో ఉంది.
ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది:
“ఓట్లు కాదు — మా జీవితాలు చూడండి. మా గల్లీలో ఒక సాయంత్రం గడపండి.”

