జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర గ్రంథాలయ చైర్‌పర్సన్ రియాజ్ గారు మరియు కాంగ్రెస్ నేత పవన్ గారు ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యూహం, ప్రజా స్పందనపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు.
రియాజ్ గారు మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ లో ఈ బైఎలక్షన్ అభివృద్ధి ఆధారంగా జరగబోతుంది. మేము సానుభూతిని కాదు, అభివృద్ధిని నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి బైఎలక్షన్ ఇది. ప్రజలు రెండేళ్లలో చేసిన అభివృద్ధిని గమనించారు. కాబట్టి విజయం కాంగ్రెస్ దే అవుతుంది” అని అన్నారు.
పవన్ గారు మాట్లాడుతూ, “మా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనలతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో రెండు నెలలు పూర్తిగా ఫీల్డ్‌లో పనిచేశాం. అభివృద్ధి, సామాజిక న్యాయం, యువత ఉపాధి, మైనారిటీల ప్రగతి – ఇవన్నీ మా ప్రధాన అజెండాలు” అన్నారు.
బిఆర్ఎస్ ప్రచారంపై స్పందిస్తూ ఆయన, “బిఆర్ఎస్ సానుభూతిని ఎజెండాగా తీసుకుంది, మేము అభివృద్ధిని తీసుకున్నాం. ప్రజలు ఇప్పుడు సానుభూతి కాదు, వాస్తవ అభివృద్ధి కోరుకుంటున్నారు” అన్నారు.
‘సిక్స్ గ్యారెంటీలు’ అంశంపై మాట్లాడుతూ పవన్ గారు తెలిపారు:
“ఫ్రీ బస్తీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్ — ఇవన్నీ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో సిక్స్ గ్యారెంటీల ఫలితాలు ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. ప్రజలు చెబుతున్నారు – ‘ఇప్పుడు మా ఇంట్లో సన్న బియ్యం తింటున్నాం’ అని.”
ఫేక్ ఓట్ల ఆరోపణలపై ఆయన వ్యాఖ్యానిస్తూ, “ఫేక్ ఓట్లు అంటే మూడురోజుల్లో మారిపోతాయా? రాహుల్ గాంధీ ఫేక్ ఓట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఆధారరహితమైనవే” అన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా రియాజ్ గారు స్పష్టత ఇచ్చారు:
“బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము ప్రతిపాదించాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోవడం వల్ల ఆగిపోయింది. బంతి ఇప్పుడు బీజేపీ చేతుల్లో ఉంది. వారు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, బిల్లు ఆమోదింప చేయాలి. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. వారు రాజకీయంగా రిజర్వేషన్లకు వ్యతిరేకులు” అని అన్నారు.
ఇక చివరగా, పవన్ గారు “జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేయబోతున్నారు. యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలిచి రాబోతున్నారు” అంటూ నమ్మకం వ్యక్తం చేశారు.

