రజినీ–కమల్ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరు? సీటు మళ్లీ ఖాళీ.. ఇప్పుడు కొత్త పేరు హాట్ టాపిక్!

కొలీవుడ్ లెజెండ్స్ రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి చేస్తున్న ‘తలైవర్ 173’ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చిన రోజునుంచే అభిమానుల్లో ఊహలకు అతీతమైన స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఇద్దరు ఐకానిక్ స్టార్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారని తెలిసిన క్షణం నుంచే ఈ సినిమా గురించి ఆశలు ఆకాశాన్ని తాకాయి.

ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తారని భారీగా ప్రచారం జరిగింది. ఆయన కూడా సిద్ధమని ప్రచారం వచ్చినా… రజినీ హీరోగా ఆయన తీసిన కూలీ సినిమా ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో equations మారిపోయాయి. దీంతో లోకేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే మాట బాగా చక్కర్లు కొట్టింది.

తర్వాత రజినీకాంత్‌తో జైలర్ 2 చేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ పేరు బజార్లో మార్మోగింది. కానీ ఆ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఈ క్రమంలో అకస్మాత్తుగా సీనియర్ డైరెక్టర్ సుందర్.సి పేరు బయటకు వచ్చింది. ఆయనే ఈ భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తారని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో “ఇక దర్శకుడిపై సస్పెన్స్ ముగిసింది” అనుకునేలోపే… సుందర్.సి అనుకోని నిర్ణయం తీసుకున్నారు.

తాను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన సుందర్.సి… “ఇలాంటి అవకాశం కోల్పోవడం బాధగా ఉన్నా, పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాల్సి వచ్చింది. రజినీ–కమల్ గార్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో దర్శకుడి కుర్చీ మళ్లీ ఖాళీ అయిపోయింది.

ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొత్త పేరు కార్తీక్ సుబ్బరాజ్.
పిజ్జా, జిగర్తాండా వంటి సినిమాలతో ప్రత్యేక ముద్ర వేసుకున్న కార్తీక్… రజినీతో చేసిన పేట సినిమా బాగానే నడిచినా భారీ రేంజ్‌లో మాత్రం నిలవలేదు. తాజా చిత్రం రెట్రో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ, ఆయన స్టైల్, విజువల్ ట్రీట్, కథ చెప్పే విధానం దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌కు సరిపోయే వ్యక్తి ఆయనే అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం అభిమానులంతా “తలైవర్ 173”కు అసలు దర్శకుడు ఎవరు? ఎప్పుడు ఫిక్స్ అవుతారు? అనేది తెలుసుకోవడానికి వేచి చూస్తున్నారు. ఇక ఈ విషయంపై ప్రొడక్షన్ టీమ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *