మీసం తిప్పరా తెలుగోడా.. బిగ్‌బాస్ తెలుగు సీజన్–9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల, కామనర్ నుంచి చాంపియన్ వరకూ స్ఫూర్తిదాయక ప్రయాణం

బిగ్‌బాస్ తెలుగు సీజన్–9కు ఘనంగా ముగింపు పలికింది. 105 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ సీజన్‌లో చివరి వరకూ ఉత్కంఠభరిత పోరు కొనసాగింది. ఫైనల్‌లో తనూజ గౌడ–కళ్యాణ్ పడాల మధ్య నెక్ అండ్ నెక్ ఫైట్ నడవగా, చివరికి చాలా స్వల్ప తేడాతో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.

సీజన్ ప్రారంభం నుంచి తనూజ విన్నర్ రేసులో ముందుండగా, ఫ్యామిలీ వీక్‌ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. చివరి కెప్టెన్‌గా ఎంపికై, ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచిన కళ్యాణ్ అదే ఊపులో ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో కామనర్‌గా వచ్చి విన్నర్ అయిన అరుదైన ఘనతను సాధించాడు.

ఈ సీజన్‌లో తొలిసారి ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా కామనర్లకు పెద్ద అవకాశం ఇచ్చారు. వేలాది అప్లికేషన్లలో నుంచి ఎంపికైన 15 మందిలో కళ్యాణ్ పడాల ఒకరు. సీఆర్పీఎఫ్ జవాన్ అయిన కళ్యాణ్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అగ్నిపరీక్ష అవకాశం రావడంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు.

హౌస్‌లోకి వచ్చిన తొలి మూడు వారాలు కళ్యాణ్ ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ప్రియ ఎలిమినేషన్ తర్వాత నుంచి కళ్యాణ్ ఆట పూర్తిగా మారింది. ప్రతి వారం తన ఆటను మెరుగుపరుచుకుంటూ ఫ్యామిలీ వీక్ నాటికి విన్నర్ రేసులోకి దూసుకొచ్చాడు. చివరికి కెప్టెన్, ఫస్ట్ ఫైనలిస్ట్, విన్నర్‌గా అవతరించి ప్రేక్షకుల చేత ‘జై జవాన్’ అనిపించుకున్నాడు.

ఫినాలేలో నాగార్జున టాప్–2కి గోల్డెన్ బ్రీఫ్‌కేస్ ఆఫర్ ఇవ్వడం పెద్ద చర్చకు దారి తీసింది. రూ.20 లక్షల బ్రీఫ్‌కేస్‌ను ఇద్దరూ తిరస్కరించారు. “డబ్బు అవసరమే కానీ, ఓటేసిన ప్రేక్షకులను అవమానించలేను” అంటూ కళ్యాణ్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. చివరికి నాగార్జున కళ్యాణ్ చేతిని ఎత్తి బిగ్‌బాస్ సీజన్–9 విన్నర్‌గా ప్రకటించారు.

విన్నర్‌గా కళ్యాణ్ పడాల‌కు ట్రోఫీతో పాటు రూ.35 లక్షల ప్రైజ్ మనీ మరియు మారుతీ సుజుకీ విక్టోరీస్ కారు లభించాయి. చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన తనూజ గౌడ రన్నరప్‌గా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *