ప్రస్తుతం డైరెక్టర్లు స్టార్ కాంబినేషన్ల కంటే కంటెంట్‌ను నమ్ముకుని సినిమాలు చేస్తున్న ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. కథలోని ప్రతి పాత్రకు ఎవరు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారో స్క్రీనింగ్ చేసి మరీ ఎంపిక చేస్తున్నారు. అయితే ఒకసారి ఆ అవకాశం దక్కిన తర్వాత, ఆ పాత్ర బరువును మోసే బాధ్యత పూర్తిగా నటీనటులపైనే ఉంటుంది. దర్శకుడు కొంతవరకే గైడ్ చేయగలరు. ఆ తర్వాత రాణించాల్సింది నటుల ప్రతిభతోనే.
ఇలాంటి టాలెంట్ ఉన్న నటీనటులు దొరకడం చాలా అరుదు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రల్లో ఇది మరింత కష్టమైన విషయం. భాష తెలియకపోవడం, యాక్టింగ్ స్కిల్స్ పూర్తిగా లేకపోవడం… కేవలం పాత్రకు సూట్ అవుతుందన్న కారణంతో ఎంపిక చేయడం లాంటి సందర్భాలు తరచూ కనిపిస్తుంటాయి. కొన్ని సార్లు ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది… మరికొన్ని సార్లు పూర్తిగా ఫెయిల్ అవుతుంది.
అయితే తాజాగా దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘యూఫోరియా’ విషయంలో మాత్రం ఈ ఫార్ములా పూర్తిగా రివర్స్ అయ్యిందనే చెప్పాలి. చాలా కాలం తర్వాత గుణశేఖర్ ఒక యూత్ పుల్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్, విఘ్నేష్ గవిరెడ్డి, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి సారా అర్జున్ పాత్ర గురించి గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
సారా అర్జున్ ఈ సినిమాలో నటించకపోతే… ప్రాజెక్ట్‌ను పూర్తిగా ఆపేయాలనుకున్నానని, ఈ విషయాన్ని తన భార్య నీలిమతో కూడా చెప్పానని గుణశేఖర్ స్వయంగా వెల్లడించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
దీంతో సారా అర్జున్ పాత్ర ఈ సినిమాలో ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతోంది. ఇప్పటి వరకు చాలా మంది ఆమెది ఓ చిన్న పాత్రే అనుకున్నారు. కానీ గుణశేఖర్ మాటలతో ఆమె క్యారెక్టర్ సినిమాలో కీలకమైన మలుపు అని క్లారిటీ వచ్చేసింది.
సాధారణంగా కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నప్పుడు దర్శకులు వాళ్లపై పూర్తిగా ఆధారపడరు. థియేటర్‌కు ప్రేక్షకులను లాక్కొచ్చే స్టార్ పవర్ ఉండదు కాబట్టి, కంటెంట్ మీదే పూర్తి భారం పెడతారు. కానీ ‘యూఫోరియా’ కథ మాత్రం గుణశేఖర్ మనసును బలంగా కదిలించిన కథగా తెలుస్తోంది.
ఈ సినిమాను చూసే సమయంలో కొందరు మధ్యలోనే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశముందని, మరికొందరికి తనపై కోపం వచ్చి తిట్టినా తిడతారని గుణశేఖర్ ఓపెన్‌గా చెప్పారు. కానీ సినిమా పూర్తయ్యాక మాత్రం అందరూ ఆలోచించకుండా ఉండలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక సారా అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటించిన తొలి చిత్రం ‘ధురంధర్’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు బ్రేక్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్లలోనే కాదు, దేశవ్యాప్తంగా హీరోయిన్లలోనే ఇది ఓ అరుదైన ఘనతగా నిలిచింది.
‘ధురంధర్’ విజయం తర్వాత సారా అర్జున్ పేరు దేశమంతా మారుమోగుతోంది. ఆ క్రేజ్ ఇప్పుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘యూఫోరియా’ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తానికి, ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ అప్పుడే ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తోంది. ఆమె పాత్ర ‘యూఫోరియా’ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి మరి.

