ధురంధర్… ప్రస్తుతం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. శత్రుదేశం పాకిస్థాన్‌లో సైతం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ సినీ చరిత్రనే కాదు, ఇండియన్ సినిమా దిశనే మార్చేస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది.
రణ్‌వీర్ సింగ్ హీరోగా, యూరి ఫేమ్ ఆదిత్య ధర్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. వాస్తవ సంఘటనలను అత్యంత రియలిస్టిక్‌గా తెరపై ఆవిష్కరించిన ఈ సినిమా ఇప్పుడు ‘టాప్ ఆఫ్ ది వరల్డ్’గా నిలిచింది.
ఒక సాధారణ వ్యక్తిగా ఇండియన్ స్పై అండర్‌కవర్ ఆపరేషన్ కోసం పాకిస్థాన్‌లో అడుగుపెట్టి ధురంధర్ ఆపరేషన్‌ను ఎలా మొదలుపెట్టాడు? ఎలా ముగించాడు? అనే ఆసక్తికర కథతో రూపొందిన ఈ సినిమా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఎలాంటి భారీ అంచనాలు లేకుండా డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఇప్పటివరకు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలోనూ ఇండియన్ సినిమాల్లోనే అత్యధిక మొత్తాన్ని దక్కించుకుని, పుష్ప 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది.
వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రణ్‌వీర్ సింగ్‌కు ఈ సినిమా తిరుగులేని విజయాన్ని అందించి కొత్త స్టార్‌డమ్, క్రేజ్ తీసుకొచ్చింది. అలాగే కెరీర్ ముగిసినట్టేనని కామెంట్లు వినిపించిన వేళ అక్షయ్ ఖన్నాకు కూడా ఈ చిత్రం సరికొత్త మలుపు తిప్పింది. రెహమాన్ బలోచ్ అనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బలోచ్ లీడర్‌ను కలిసే సీన్‌లో ఆయన వేసిన చిన్న స్టెప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ట్రెండింగ్‌కు కారణమైంది.
ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా రియలిస్టిక్‌గా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉండటంతో కొందరు ‘టూ మచ్ వయోలెన్స్’ అంటూ విమర్శలు చేస్తుండగా, మరికొందరు మాత్రం ‘నిజంగా జరిగినదే చూపించారు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఫస్ట్ పార్ట్ చివర్లో రెహమాన్ బలోచ్ క్యారెక్టర్‌ను ముగించిన ఆదిత్య ధర్, ధురంధర్ పార్ట్ 2లో రివేంజ్ యాంగిల్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారని సమాచారం. ఈ విషయాన్ని రెహమాన్ క్యారెక్టర్‌కు రైట్ హ్యాండ్ ‘డోంగా’ పాత్రలో నటించిన నవీన్ కౌశిక్ వెల్లడించారు.
పార్ట్ 1లో చూసిన యాక్షన్, మిస్టరీ, మానిప్యులేషన్ పార్ట్ 2లో 50 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నేను ఆ సన్నివేశాలను చూశాను. అవి అందరినీ షాక్‌కు గురి చేస్తాయి. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పార్ట్ 2లో నేను ఉండను కానీ ఏం జరగబోతోందో ఇప్పుడే చెప్పలేను అంటూ నవీన్ కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను పెంచేశాయి.
దీంతో పార్ట్ 1ను ‘ఓవర్‌డోస్ వయోలెన్స్’ అని విమర్శించినవారు, పార్ట్ 2 చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ధురంధర్ పార్ట్ 2 ఇండియన్ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందా? అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది.

