గోవా బీచ్ లో ప్రభుత్వాన్ని కదిలించిన ఘటన

                                               గోవా బీచ్ లో ఓ పనికిమాలిన పని తెరపైకి వచ్చింది. ప్రపంచం ముందు భారతదేశం పరువు తీసే పనికి కొంతమంది బౌన్సర్లు పూనుకున్నారు! దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. పెట్రోలింగ్ పెంచుతామని, ఈ ఘటనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది! అవును.. గోవాలోని ప్రసిద్ధ అరాంబోల్ బీచ్ నుండి వచ్చిన ఒక వీడియో తీవ్ర కలకలం రేపింది. ఇందులో.. కొంతమంది బౌన్సర్లు ఇద్దరు విదేశీ మహిళలను ఫోటోలకు పోజులివ్వమని బలవంతం చేస్తున్నట్లు కనిపించింది. ఆ పురుషులు సదరు మహిళల చుట్టూ చేతులు వేయడం.. ఆ సమయంలో ఆ విదేశీ వనితలు అసౌకర్యంగా ఉండటం కనిపించింది. 

                                               ఇదే సమయంలో వాగేటర్ నుండి నివేదించబడిన మరొక కేసులో.. స్థానిక సంస్థలోని బౌన్సర్లు అనుచితంగా జోక్యం చేసుకున్నారని, వారణాసి నుండి వచ్చిన ఓ కుటుంబానికి బాధ కలిగించారని ఆరోపించారు. దీంతో… పర్యాటకులను వేధిస్తున్న సంఘటనలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, పెట్రోలింగ్ పెంచుతామని గోవాలోని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన రాష్ట్ర పర్యాటక శాఖ… పర్యాటక సంబంధిత సమస్యలను పరిష్కరించే అధికారం బౌన్సర్లకు లేదని పేర్కొంది. ఏ రూపంలోనైనా దాడి, బెదిరింపు లేదా దుష్ప్రవర్తన జరిగితే చట్ట అమలు అధికారుల సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గోవా పోలీసులతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. 

                                                 ఈ సందర్భంగా స్పందించిన పర్యాటక డైరెక్టర్ కేదార్ నాయక్… ఇటువంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఇది గోవా విలువలను ప్రతిబింబించదని అన్నారు. ఇటీవలి వెలుగులోకి వచ్చిన పలు సంఘటనల దృష్ట్యా.. పర్యాటక పోలీసులను పగలు, రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, కీలక ప్రదేశాలలో నిఘా పెంచాలని కోరినట్లు తెలిపారు. మరోవైపు.. గోవాను సందర్శించే ప్రతి వ్యక్తి ఇక్కడ సురక్షితంగా, సుఖంగా ఉండేలా చూసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని.. బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం.. పోలీసులు, పర్యాటక వాటాదారులతో కలిసి పనిచేస్తూనే ఉంటుందని పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *