లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్‌లో ఎంత పెద్ద హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దక్షిణాదిన ట్రెండింగ్‌లో ఉన్న నెంబర్ వన్ బ్యూటీ ఆమెనే. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా నయన్ పేరు ముందుంటుంది. సౌత్‌లోని అన్ని పరిశ్రమలు ఆమెతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తాయి. స్టార్ హీరోలు సైతం నయనతార డేట్స్ కోసం క్యూలో ఉంటారు అంటే అతిశయోక్తి కాదు.
ఇంతటి స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం నయనతార తన కెరీర్‌ను తానే జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవడమే. నలుగురిలో ఒకరిగా కాకుండా, నలుగురికి భిన్నంగా ఉండటమే ఆమెకు వచ్చిన ఆక్రేజ్కు కారణం. వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ నయన్ చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది. నటిగా మాత్రం ఆమె అడుగులు చాలా వ్యూహాత్మకంగా వేస్తోంది.
క్లాస్, మాస్ ఇమేజ్‌లను తెలివిగా బ్యాలెన్స్ చేయడంలో నయనతారకు ఉన్న అవగాహన మరే హీరోయిన్‌కు లేదనే చెప్పాలి. కోలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తూనే, తెలుగులో సీనియర్ హీరోలకు జోడీగా కనిపిస్తోంది. అయితే ఆ తర్వాతి తరం హీరోలతో మాత్రం ఆమె సినిమాలు చేయడం లేదు. అవకాశాలు వచ్చినా స్కిప్ చేస్తోంది.
దానికి కారణం కూడా చాలా క్లియర్. యువ హీరోలతో నటించిన సినిమాలు ఫెయిల్ అయితే, ఆ ప్రభావం తన కెరీర్‌పై పడుతుందని నయనతార భావిస్తుంది. అదే సీనియర్ హీరోల సినిమాలు ప్లాప్ అయినా, ఆ క్రెడిట్ మొత్తం హీరో ఖాతాలోకే వెళ్లిపోతుంది. హీరోయిన్ ఇమేజ్‌పై పెద్దగా ప్రభావం ఉండదు. అయితే సినిమా హిట్ అయితే మాత్రం హీరోతో పాటు హీరోయిన్‌కు కూడా పేరు వస్తుంది. ఇదే తెలుగు సినిమాల విషయంలో నయనతార ఆడుతున్న తెలివైన ఆట.
కోలీవుడ్‌లో మాత్రం కమర్షియల్ సినిమాలు చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అయితే దురదృష్టవశాత్తు, సోలో హీరోయిన్గా వచ్చిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద ఒంటరిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నా, ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. నిజంగా ఆ రోజు వస్తే మాత్రం నయనతార ఇమేజ్ నాలుగు రెట్లు పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీల్లో కూడా నయనతార కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు డాక్యుమెంటరీలపై సీరియస్‌గా పని చేయలేదు. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే చేస్తోంది. కానీ కొత్త ఏడాదిలో వాటిపైనా ఫోకస్ పెట్టబోతుందన్నది తాజా సమాచారం.
ఈ ఏడాది నయనతార ఏకంగా తొమ్మిది నుంచి పది సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నట్లు టాక్. ఇప్పటికే ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్‌తో ఈ ఏడాదికి బోణీ కొట్టేసింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఇప్పటికే 200 కోట్ల వసూళ్లు సాధించింది. త్వరలోనే 300 కోట్ల క్లబ్‌ను క్రాస్ చేస్తుంది అనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
మొత్తానికి, కెరీర్ పరంగా నయనతార తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక పర్ఫెక్ట్ ప్లానింగ్ కనిపిస్తోంది. అందుకే ఆమె ఇప్పటికీ లేడీ సూపర్ స్టార్‌గా సౌత్ ఇండస్ట్రీలో రాజ్యమేలుతోంది.

