తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఏకమయ్యాయి. రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి బీసీ ఐక్యత కార్యాచరణ కమిటీ (BC Joint Action Committee – BC JAC) ఆవిర్భవించింది.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ ఏర్పాటైంది. ఇందులో జేఏసీ చైర్మన్‌గా ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా విజిఆర్. నారగోని, కో-చైర్మన్‌లుగా రాజారాం యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జా కృష్ణ నియమితులయ్యారు.
హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ జేఏసీ అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ చేపట్టాలని నిర్ణయించింది. ముందు నిర్ణయించిన జాతీయ రహదారి దిగ్బంధం (13వ తేదీ) మరియు రాష్ట్ర బంద్ (14వ తేదీ) కార్యక్రమాలను వాయిదా వేసి, ఒకే రోజు — అక్టోబర్ 18న బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఉద్యమం చేపట్టాలని ప్రకటించింది.
జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ —
“42% బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడం ద్వారా హైకోర్టు బీసీలకు అన్యాయం చేసింది. బీసీలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి,” అని చెప్పారు.
వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ —
“రాష్ట్రంలో 60% బీసీలు ఉన్నా, వారి నోటి ముద్దను కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారు. బీసీల బలం ఏమిటో కేంద్రం, రాష్ట్రం రెండూ తెలుసుకోవాలి. బంద్ ఫర్ జస్టిస్ ద్వారా ఆ బలాన్ని చూపుతాం,”
అని స్పష్టం చేశారు.
ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ బీసీ జేఏసీ ఆవిర్భావం రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. బీసీలు పార్టీ లైన్లకు అతీతంగా ఉద్యమం ప్రారంభించడం, రాబోయే స్థానిక ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని భావిస్తున్నారు.

