నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. బడ్జెట్ అనంతరం సెన్సెక్స్ ఒక్కరోజులోనే 1,546 పాయింట్లు కుదేలు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఇటీవల అంబరాన్నంటిన బంగారం ధరలు కూడా ఒక్కసారిగా భారీగా తగ్గాయి.
బడ్జెట్ ప్రకటనల తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర తులం మీద దాదాపు రూ.12,000 వరకు తగ్గింది. వెండి ధరలు కూడా అదే బాటలో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో కూడా ఒక్కరోజులోనే బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోవడం కనిపించింది.
ఇటీవల బంగారం ధరలు మరింత పెరుగుతాయనే భయంతో కొందరు మిడిల్ క్లాస్ కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మరింత బంగారం కొనుగోలు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ తరహా తొందరపాటు పెట్టుబడులు సామాన్య ప్రజలకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ కూడా బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఆమె ప్రకటనల తర్వాతే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు కుదేలు కావడం విశేషం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేయబడుతోంది.
అయితే బంగారం కొనుగోలు చేయకూడదని కాదు, కానీ ఒక్కసారిగా నిర్ణయం తీసుకోకుండా మార్కెట్ పరిస్థితులను గమనించి, నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ లేదా విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి అవగాహన అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే, కేంద్ర బడ్జెట్ అనంతరం మార్కెట్లలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు సామాన్య ప్రజలు అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.

