రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయనకు భారీ ఊరట లభించింది.
అయితే రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు యూపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. నియామక ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజీపీ పదవీ విరమణకు మూడు నెలల ముందే యూపీఎస్సీకి అర్హులైన అధికారుల ప్యానల్ పంపాల్సి ఉంటుందని, ఆ ప్రక్రియ పాటించలేదని పిటిషనర్ వాదించారు. శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. గత ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్య ఐదుగురు అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపామని కోర్టుకు వివరించారు. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 31న మరోసారి జాబితా పంపినప్పటికీ, సుప్రీం కోర్టు అనుమతి తీసుకోవాలంటూ యూపీఎస్సీ ఆ జాబితాను తిరిగి పంపిందని ఏజీ తెలిపారు.
యూపీఎస్సీని తగిన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరినట్టు వెల్లడించారు. అన్ని వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, మధ్యంతర పిటిషన్ను కొట్టివేస్తూ శివధర్ రెడ్డి నియామకంపై తాత్కాలికంగా ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది.
అయితే రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తిచేయాలని స్పష్టంగా ఆదేశిస్తూ కేసు విచారణను కొనసాగించనున్నట్లు హైకోర్టు తెలిపింది.

