హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, సంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో భారీ స్థాయిలో ప్రభుత్వ భూముల కబ్జాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అధికారిక అంచనాల ప్రకారం ఈ మూడు జిల్లాల్లోనే దాదాపు లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి భూ మాఫియా అనుసరిస్తున్న పద్ధతులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సీలింగ్, భూదాన్, పోరంబోకు, బంజరు భూములను లక్ష్యంగా చేసుకుని డాక్యుమెంట్ల టాంపరింగ్, నకిలీ రిజిస్ట్రేషన్లు, అక్రమ మ్యూటేషన్లు చేస్తూ పెద్ద ఎత్తున భూదందాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న భూములను కూడా ప్రైవేట్ పేర్లకు మార్చి కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకొని నిర్మాణాలు చేపడుతున్నారు.
ఇటీవల పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఫీల్డ్ సర్వేకు సిద్ధమవుతోంది. పహాని, సేత్వార్, కస్రా, ముంతఖాబ్ వంటి పాత రికార్డులను సేకరించి, భూముల అసలు స్థితిని నిర్ధారించేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే లోయర్ కోర్టుల నుంచి హైకోర్ట్, సుప్రీంకోర్ట్ వరకు పెండింగ్‌లో ఉన్న భూవివాదాలపై కూడా సమీక్ష జరపనుంది.
మియాపూర్ ప్రాంతంలోనే సుమారు 600 ఎకరాల భూమి మాయం అయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే కుత్బుల్లాపూర్ పరిధిలో సుమారు 400 ఎకరాల సీలింగ్ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమించి, లేఔట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ బోర్డులను తొలగించి తమ బోర్డులు ఏర్పాటు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇక ఇబ్రహీంపట్నం పరిధిలోని భూదాన్ భూములు కూడా కబ్జాకు గురయ్యాయి. వినోబా భావే పాదయాత్ర సమయంలో దానం చేసిన ఈ భూములను పేదలకు పంచాల్సి ఉండగా, నకిలీ వారసులను సృష్టించి, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ కోట్ల విలువైన విల్లాలు నిర్మాణం అయ్యాయి.
ఈ పరిణామాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలపై మాత్రం కఠిన చర్యలు తీసుకునే ప్రభుత్వం, పెద్ద ఎత్తున జరుగుతున్న భూకబ్జాలపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఇందులో భాగమయ్యారన్న అనుమానాలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి.
మొత్తానికి, ప్రభుత్వం చేపట్టనున్న ఫీల్డ్ సర్వే, డిజిటలైజేషన్ ప్రక్రియలు ఈ భూదందాలకు చెక్ పెడతాయా? లేదా మాఫియా ప్రభావం కొనసాగుతుందా? అన్నది చూడాల్సి ఉంది.

