గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరో అడుగు.. పద్మశ్రీ డా. నేరెల్ల వేణు మాధవ్ జయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో కోటి వృక్షార్చన

మన జీవితంలో ముందుకు వెళ్లాలంటే మంచి చదువు, మంచి వాతావరణం అత్యంత అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చదనం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ దిశగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం కోట్లాది మొక్కలు నాటేలా ప్రజలకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.

అదే అడుగుజాడల్లో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదేళ్లుగా కొనసాగుతూ ఇప్పటివరకు 25 కోట్లకు పైగా మొక్కలు నాటిన ఘనత సాధించిందన్నారు. రాబోయే తరాలు స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యంగా జీవించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు.

ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లిరోజు, విజయాలు సాధించిన సందర్భాల్లో కనీసం ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు భవనాలు, సంపదలు కంటే పచ్చదనం ఇచ్చినప్పుడే నిజమైన వారసత్వం అవుతుందని తెలిపారు.

పద్మశ్రీ డా. నేరెల్ల వేణు మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన గురుకుల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మిమిక్రీ రంగంలో అమ్మాయిల భాగస్వామ్యం పెరగడం సంతోషకరమని నిర్వాహకులు పేర్కొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవు గారి సహకారంతో, జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి కార్యక్రమానికి సేవాభావాన్ని జోడిస్తే ప్రకృతి కూడా మనకు తోడుగా నిలుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే సంస్కృతిని అలవర్చుకోవాలని, అదే మన సమాజానికి, భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బహుమతి అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *