జన నాయకన్.. ఇప్పుడు రాకపోతే కష్టమే! సెన్సార్ గండంలో విజయ్ లాస్ట్ మూవీ

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన కెరీర్‌లో చివరి సినిమాగా చేస్తున్న ‘జన నాయకన్’ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. ఇప్పటికే రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన విజయ్, ఇకపై సినిమాలు చేయనని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విజయ్ నుంచి వచ్చే లాస్ట్ మూవీ కావడంతో, ఇందులో డైలాగులు, సీన్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని అభిమానులు భారీగా ఆశించారు.

అయితే అదే పవర్‌ఫుల్ కంటెంట్ ఇప్పుడు సినిమాకు సమస్యగా మారింది. సెన్సార్ బోర్డు వద్ద ‘జన నాయకన్’కు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. సినిమా విడుదల విషయంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేయడంతో, ప్రస్తుతం అందరి దృష్టి మద్రాస్ హైకోర్టుపైనే నిలిచింది.

వాస్తవానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ కమిటీకి చెందిన ఒక సభ్యుడు అంతర్గతంగా ఫిర్యాదు చేయడంతో సర్టిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సినిమాలో సాయుధ దళాల చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందని, అలాగే కొన్ని సీన్లు రాజకీయంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు.

ఇప్పుడు అందరి కళ్లు జనవరి 20న జరగబోయే మద్రాస్ హైకోర్టు విచారణపైనే ఉన్నాయి. కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తే తప్ప ‘జన నాయకన్’ థియేటర్లకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ తీర్పు ఆలస్యమైతే మాత్రం సినిమాకు రిలీజ్ డేట్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, ఈ సినిమాను జనవరి 30 లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ఈ ఫిబ్రవరి డేట్లు కూడా మిస్ అయితే, సినిమా నేరుగా జూన్ తర్వాతే థియేటర్లకు రావాల్సి వస్తుంది.

దీనికి కారణం తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వస్తే, వివాదాస్పద రాజకీయ అంశాలు ఉన్న సినిమాల విడుదలకు నిబంధనలు పెద్ద అడ్డంకిగా మారతాయి. విజయ్ లాంటి భారీ స్టార్ సినిమా ఐదు నెలల పాటు వాయిదా పడటం అనేది ట్రేడ్ పరంగా పెద్ద నష్టమేనని చెప్పాలి.

రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు విజయ్ ఇచ్చే ఈ సినిమా ఒక రకంగా ‘పొలిటికల్ స్పీచ్’ లాంటిదిగా అభిమానులు భావిస్తున్నారు. దర్శకుడు హెచ్. వినోద్ మేకింగ్‌లో విజయ్ మార్క్ యాక్షన్ అండ్ మెసేజ్ ఎలా ఉండబోతోందో చూడాలనే క్యూరియసిటీ అందరిలోనూ ఉంది.

మొత్తానికి, ‘జన నాయకన్’ విడుదల పూర్తిగా న్యాయస్థానం తీర్పుపైనే ఆధారపడి ఉంది. జనవరి 20న వచ్చే క్లారిటీని బట్టి విజయ్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు దండయాత్ర చేస్తారో తేలనుంది. ఈ ఆఖరి పోరాటంలో విజయ్ సెన్సార్ గండాన్ని ఎలా దాటుతారో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *