జీవన్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, తెలంగాణ రాజకీయాల్లో కలకలం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. దాదాపు 40 ఏళ్ల పాటు పార్టీకి సేవలు అందించిన ఆయన, తనకు మరియు తన అనుచరులకు సరైన గౌరవం లభించడం లేదనే ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామాను ప్రకటించిన జీవన్ రెడ్డి, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ లోపలి వ్యవహారాల్లో సీనియర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం తగదని విమర్శించారు.

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిజాయితీగా పని చేసిన నేతలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. తనకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, తన అనుచరులకు న్యాయం జరగలేదని కూడా ఆరోపించారు.

రాజీనామా అనంతరం రైతు ఖండువా ధరించి మాట్లాడిన ఆయన, ఇకపై ప్రజల కోసం స్వతంత్రంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లతో పోరాడిన తాను, అవసరమైతే రేవంత్ రెడ్డితో కూడా పోరాటానికి సిద్ధమని వ్యాఖ్యానించారు.

ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సీనియర్ నాయకుడు పార్టీని వీడడం వల్ల కేడర్‌లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *