జూబిలీహిల్స్ ఉపఎన్నిక: రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు, అభివృద్ధి–సెంటిమెంట్ మధ్య ఎన్నికల దుమారం

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, హామీలు, విమర్శలపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఉపఎన్నికల్లో సానుభూతి, కన్నీళ్లు ముసుగులో గెలవాలన్న ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించి అభివృద్ధి కోరారని సీఎం రేవంత్ పేర్కొంటే, ప్రతిపక్షాలు మాత్రం అదే వ్యాఖ్యలను ఆయనకే తిరగబెడుతున్నాయి.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కంటోన్మెంట్‌లో రూ.4వేల కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. “గతంలో సినీ కార్మికులను పట్టించుకోలేదు, ఇప్పుడు ఒక్కసారిగా ప్రేమ చూపడం ఎందుకు?” అంటూ బీఆర్‌ఎస్‌ను ఎద్దేవా చేశారు. బీజేపీ కార్పొరేట్ బాంబింగ్ చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

అయితే ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం ఉన్న ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇస్తే బాగుంటుందని, బెదిరింపుల ధోరణి ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్‌ఎస్ గెలిస్తే ఉచిత బస్సు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆగిపోతాయని చెప్పిన రేవంత్ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతున్నాయి.
“మీ ప్రభుత్వమే కొనసాగుతోంది, ఒక నియోజకవర్గ ఫలితం వల్ల రాష్ట్ర పథకాలు ఎందుకు మారాలి?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అజారుద్దీన్‌కు మంత్రి పదవి హామీ ఇవ్వడం కూడా రాజకీయ గణాంకంగా సరైనది కాదని విమర్శ ఉంది. “సమయస్ఫూర్తి లేదు, స్క్రిప్ట్ తప్పింది” అని సోషల్ మీడియా స్పందిస్తోంది. అభివృద్ధి చేయాల్సిన సమయానే విగ్రహ రాజకీయాలు చేయడం పబ్లిక్‌కి నచ్చడం లేదనేది ప్రజాభిప్రాయం.

డ్రగ్స్ అంశంలో గత ప్రభుత్వం చేసిన తప్పులే కాక, ప్రస్తుత ప్రభుత్వం కూడా తక్కువేమీ కాదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. నిజంగా అభివృద్ధి చూపడం కంటే ప్రచారంలో భావోద్వేగాలు, విమర్శలు, విగ్రహ వాగ్దానాలు ఓట్ల కోసం వినిపిస్తున్నాయి.

ప్రజలు ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నారు — “ఎమోషన్ కాదు, అభివృద్ధి కావాలి.”
రోడ్లు, డ్రైనేజ్, బస్తీల సమస్యలు, విద్యుత్ సమస్యలు పరిష్కారాన్ని ఎదురు చూస్తున్న జూబిలీహిల్స్ ఓటర్లు ఎవరు ఆచరణలో చూపిస్తారో వారికే అవకాశమివ్వాలని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *