హైదరాబాద్‌లో మరో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. నమ్మదగిన సమాచారంతో పోలీసులు కేసీఆర్ రిసార్ట్స్‌లో అక్రమ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకుని రాత్రి 8:30 ప్రాంతంలో దాడి నిర్వహించారు.
పోలీసుల ప్రకారం, రిసార్టులో రెండు వేర్వేరు గ్రూపులు లిక్కర్ పార్టీ నిర్వహించాయి. “వేద అగ్రీ” అనే సీడ్స్ కంపెనీకి చెందిన తిరుపతి రెడ్డి, తన డీలర్లతో కలిసి పార్టీ ఏర్పాటు చేశాడు. లిక్కర్, మహిళలతో డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరో రూమ్‌లో “రాక్ రాక్‌స్టార్” సీడ్స్ కంపెనీకి చెందిన సైదా రెడ్డి కూడా తన డీలర్లతో కలిసి ఇలాంటి పార్టీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు.
మొత్తం 20 మంది మహిళలు, 56 మంది పురుషులను కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం 76 మంది రిసార్టులో ఉన్నారని పోలీసులు తెలిపారు. రెండు కంపెనీ యజమానులు, డీలర్లు, రిసార్ట్ ఓనర్, మేనేజర్లపై కేసులు నమోదు చేశారు.
ప్రాథమిక విచారణలో గాంజా లేదా డ్రగ్స్ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. “రిసార్టులో మద్యం బాటిల్స్ మాత్రమే దొరికాయి. విదేశీ మద్యం ఏదీ లేదు. పంచనామా నిర్వహించి వారిని కోర్టుకు తరలిస్తాం,” అని అధికారులు తెలిపారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని తగిన సెక్షన్లు జోడించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

