ఖమ్మం నగరంలో భూదాన భూముల వివాదం తీవ్రంగా మారింది. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలు తమ ఇళ్లు కూల్చివేయడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. “మా ఇల్లు కూల్చి మమ్మల్ని రోడ్డుపైకి తీసుకొచ్చారు” అంటూ బాధితులు తమ కష్టాలను వెల్లడిస్తున్నారు.
బాధితుల ప్రకారం, అధికారులు తెల్లవారుజామునే భారీగా పోలీసులు, జేసీబీలతో వచ్చి ఇళ్లను కూల్చివేశారని చెబుతున్నారు. “ఉదయం నాలుగు గంటలకే వచ్చి బయటికి రండి అన్నారు. మేము బట్టలు, బియ్యం తీసుకునేలోపే మా ఇళ్లను కూల్చేశారు” అని వారు తెలిపారు. వందల సంఖ్యలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వచ్చి సామాన్లు కూడా బయటకు విసిరేశారని వారు ఆరోపిస్తున్నారు.
ఇళ్లను కోల్పోయిన తర్వాత ప్రస్తుతం బాధితులను అంబేద్కర్ భవన్లో ఉంచినట్లు వారు చెబుతున్నారు. అక్కడ సరైన సదుపాయాలు లేవని, పిల్లలు జ్వరాలతో బాధపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పిల్లలకు చదవడానికి పుస్తకాలు కూడా లేవు. బాత్రూములు సరిగా లేవు. భోజనం కూడా సరైన విధంగా ఇవ్వడం లేదు” అని బాధితులు అంటున్నారు.
బాధితుల మాటల్లో మరో బాధ కూడా కనిపిస్తోంది. “మేము 10 సంవత్సరాలుగా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నాం. కొందరం పల్లెటూర్లలో ఉన్న భూములు అమ్ముకుని కట్టుకున్నాం. కొందరు బంగారం పెట్టి అప్పులు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా కూల్చేశారు” అని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం వారికి ఇంద్రమ్మ ఇళ్లు లేదా రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఇస్తామని ప్రకటించిందని బాధితులు చెబుతున్నారు. అయితే వారు ఆ ఆఫర్ను తిరస్కరిస్తున్నారు. “మా ఇల్లు కూల్చిన అదే స్థలంలో మాకు మళ్లీ ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఎక్కడో వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెబితే మేము ఎందుకు ఒప్పుకోవాలి?” అని ప్రశ్నిస్తున్నారు.
బాధితులు మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. తమకు 2014 నుంచి కోర్టు ఆర్డర్లు ఉన్నాయని, కరెంట్, నీటి వంటి సదుపాయాలు కల్పించాలని కోర్టు చెప్పిందని వారు అంటున్నారు. ప్రభుత్వం అందించకపోవడంతో తామే డబ్బులు వేసుకుని కరెంట్ పోళ్లు, నీటి పైపులు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు..
ఇక రాజకీయ నాయకులపైనా బాధితులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు తమ సమస్యపై ఎవరూ స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు. “మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. మేము నటించడం లేదు. మా బాధ మాకే తెలుసు” అని బాధితులు చెబుతున్నారు.
మొత్తానికి బాధితుల ప్రధాన డిమాండ్ ఒక్కటే.
“మా ఇళ్లు కూల్చిన అదే స్థలంలో మాకు మళ్లీ ఇళ్లు కట్టించి ఇవ్వాలి. మా భూమి మాకు ఇవ్వాలి” అని వారు స్పష్టం చేస్తున్నారు.
ఖమ్మం భూదాన భూముల వివాదం ప్రస్తుతం రాజకీయంగా కూడా వేడెక్కుతున్న నేపథ్యంలో, ఈ సమస్యకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

