రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో తన పెళ్లి మ్యాటర్‌ని ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లోకి నెట్టేస్తున్నాడు. మొన్నటిదాకా ప్రభాస్ పెళ్లి గురించి మీడియా, ఆడియన్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్గా రాజా సాబ్ ఈవెంట్లో కూడా యాంకర్ సుమ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. కానీ నిజం చెప్పాలంటే ప్రభాస్ పెళ్లి విషయం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా, అదే మాట మళ్లీ మళ్లీ వింటూ ఆడియన్స్‌కు కొంచెం బోర్ కూడా కొట్టేసింది.
అంతకన్నా ప్రభాస్ చేస్తున్న సినిమాలే ఇప్పుడు ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఒకటి లేదా రెండు సినిమాల వరకే లైన్లో పెట్టుకుంటే, ప్రభాస్ మాత్రం అరడజను పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమా ఒక్కో రేంజ్లో ఉండడంతో, పెళ్లి కంటే కూడా అతని ఫ్యూచర్ సినిమాలపైనే ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు.
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉన్నారు. అలాగే చరిత్రలో ఎంతో మంది గొప్ప రాజకీయ నాయకులు కూడా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉన్న ఉదాహరణలు ఉన్నాయి. అంత మాత్రాన ప్రభాస్ కూడా బ్యాచిలర్‌గానే ఉండిపోతాడని కాదు. కానీ ఎంతో గొప్ప వ్యక్తులే పెళ్లి విషయంలో ఆలస్యం చేసినప్పుడు, డార్లింగ్ ప్రభాస్ లేట్ చేస్తే తప్పేముంది అన్న భావన కూడా ఫ్యాన్స్‌లో ఉంది.
ప్రభాస్‌ను చూసే మరికొంత మంది హీరోలు కూడా పెళ్లి విషయంలో టైమ్ తీసుకుంటున్నారు. రీసెంట్గా అనగనగా ఒక రాజు హీరో నవీన్ పొలిశెట్టి కూడా “ప్రభాస్ మ్యారేజ్ తర్వాతే నా పెళ్లి” అంటూ సరదాగా చెప్పడం వైరల్ అయింది. అంటే వీరంతా పెళ్లి కంటే ముందుగా కెరీర్, సినిమాలే ప్రాధాన్యంగా పెట్టుకున్నారనే చెప్పాలి.
టాలీవుడ్లో ప్రభాస్‌తో పాటు రామ్, నవీన్ పొలిశెట్టి, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు కూడా పెళ్లి విషయంలో తొందరపడటం లేదు. ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కెరీర్ సెటిల్ అయిన తర్వాతే పెళ్లి అన్న ఆలోచనతో చాలామంది హీరోలు ముందుకెళ్తున్నారు.
ప్రభాస్ పెళ్లిపై దాదాపు పదేళ్లుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి. బాహుబలి టైమ్‌లో సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని ఆయన చెప్పినా, అది ఇప్పటివరకు జరగలేదు. అయినా సరే, ప్రభాస్ పెళ్లి కన్నా ఆయన చేస్తున్న భారీ సినిమాలే ఇప్పుడు ప్రేక్షకుల్లో అసలు చర్చకు కారణమవుతున్నాయి. అందుకే టాలీవుడ్లో ప్రభాస్ పెళ్లి టాపిక్ కంటే, ఆయన లైన్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

