మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికారంలోకి వచ్చేముందు రసమై బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు చేస్తూ “నీతి నిజాయితీతో ప్రజల సేవ చేస్తానని” హామీ ఇచ్చిన సత్యనారాయణ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత తాను మాట్లాడిన విధానమే వివాదానికి కారణమైంది.
మీడియా ముందు సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు అన్‌పార్లమెంటరీగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రజా ప్రతినిధి ఇలాంటి భాషలో మాట్లాడడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు “ఇదేనా చదువుకున్న ఎమ్మెల్యే మాట్లాడే తీరు?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మానకొండూరులో “షాడో ఎమ్మెల్యే” వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. స్థానికులు అసలు ఎమ్మెల్యే కంటే షాడో ఎమ్మెల్యేకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోందని విమర్శలు వస్తున్నాయి. కోట్ల రూపాయల కమిషన్‌లు, ఇసుక దందాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ వ్యాఖ్యలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం కూడా వేడెక్కింది. 42% రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆరు వారాల తర్వాతే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
డీజీపీ కూడా బంద్ సందర్భంగా ప్రశాంతత పాటించాలని సూచించారు. ప్రజలు, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

