పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో (NDA) ఘోర విషాదం చోటుచేసుకుంది. లక్నోకు చెందిన 18 ఏళ్ల క్యాడెట్ ఆంతరిక్ష కుమార్ సింగ్ ఉరివేసుకొని చనిపోయాడనే వార్త ఆర్మీ వర్గాలను మరియు అతని కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన అక్టోబర్ 10న జరిగింది.
అయితే ఇది ఆత్మహత్య కాదని, తన కొడుకును హత్య చేశారని ఆంతరిక్ష తల్లి సీమా సింగ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చనిపోయే రెండు రోజుల ముందే తన కొడుకుతో మాట్లాడినప్పుడు ఎటువంటి బాధా లక్షణాలు కనిపించలేదని ఆమె తెలిపారు. నవంబర్ 30న సెలవులకు వస్తానని ఎంతో ఉత్సాహంగా మాట్లాడాడని చెప్పారు.
చనిపోయే రోజు కూడా ఆంతరిక్ష ఎన్డిఏ ఈవెంట్‌లో గాయకుడిగా పాల్గొన్నాడు. ఆ వీడియోలో అతను ఎంతో యాక్టివ్‌గా ఉన్నాడని సీమా వెల్లడించారు. “ఇంత ఉత్సాహంగా ఉన్న వాడు కొన్ని గంటలకే ప్రాణాలు తీసుకుంటాడా?” అంటూ ఆమె ప్రశ్నించారు.
ఆంతరిక్ష మరణానికి ముందు అతనిని ఒక సీనియర్ క్యాడెట్ బెదిరించాడని, అకాడమీని వదిలేయమని ఒత్తిడి చేశాడని సీమా గుర్తు చేశారు. ఆ సీనియర్ క్యాడెట్‌ను గుర్తించి విచారణ చేయాలని కుటుంబం డిమాండ్ చేసింది. సిసిటీవీ ఫుటేజ్లు విడుదల చేయాలని కూడా వారు కోరుతున్నారు.
ఆంతరిక్ష తండ్రి రవి ప్రతాప్ సింగ్ 26 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం డిఫెన్స్ సెక్యూరిటీలో ఉన్నారు. ఆదివారం నాడు ఆంతరిక్ష మృతదేహాన్ని త్రివర్ణ పతాకంతో కప్పి పూర్వీకుల గ్రామానికి తీసుకువచ్చి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
తమ కొడుకును కోల్పోయిన సింగ్ కుటుంబం తీరని దుఃఖంతో పాటు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

