తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తక్షణం చేయాల్సిన కర్తవ్యాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గొడవలు, రాజకీయ వివాదాలు, సిట్ విచారణలు పూర్తయ్యాయని, ఇకపై పాలనపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో మార్పు కనిపించడంలేదని, ప్రెస్ మీట్లతోనే సరిపెడుతూ సమస్యల నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ కొత్త కథనాలు, వివరణలు ఇస్తున్నా, ప్రజలకు స్పష్టమైన దిశ చూపించలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దావోస్ పర్యటనపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అక్కడ జరిగిన సమావేశాలు పెట్టుబడుల కోసం కాదని, ఇప్పటికే ఉన్న వ్యవస్థలలో భాగంగానే జరిగాయని వ్యాఖ్యానించారు. సీఎం ఏం చేశారో, ఏం చేయబోతున్నారో తెలంగాణ ప్రజలకు ఇప్పటికే తెలుసునని విమర్శకులు అంటున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవంతో ఏర్పడిన రాష్ట్రంలో ఆత్మగౌరవం లేని పాలన కొనసాగుతోందన్న భావన వ్యక్తమవుతోంది. గత పాలకులతో పోల్చినా, బలమైన నాయకత్వం కనిపించడంలేదని, పాలన దిశాహీనంగా మారిందని ఆరోపణలు చేస్తున్నారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి వంటి అంశాలపై గతంలో జరిగిన ఆరోపణల విషయంలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకుంటామని చెప్పి, చివరకు ఏమీ చేయలేదని, ఇదంతా రాజకీయ డ్రామానేనని విమర్శించారు.
అయితే దిశ ఎన్కౌంటర్, సజ్జనార్ పాత్ర విషయంలో మాత్రం కాంగ్రెస్ నాయకత్వం స్పష్టంగా ప్రజల ముందు వివరించాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. అప్పట్లో హీరోగా చూపిన వ్యక్తి ఇప్పుడు విలనా అనే విషయాన్ని ప్రభుత్వమే తేల్చాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం పారదర్శకంగా మాట్లాడాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు.

