సైదాబాద్ జువెనైల్ హోమ్‌లో దారుణం – పర్యవేక్షకుడి లైంగిక దాడికి గురైన చిన్నారులు

హైదరాబాద్ సైదాబాద్ జువెనైల్ చిల్డ్రన్ హోమ్‌లో షాక్‌కు గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి నాలుగు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. చిన్నారులను రక్షించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తే వారిపై ఈ దారుణానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

సమాచారం ప్రకారం, 2020–22 నుంచి జువెనైల్ హోమ్‌లో అవుట్‌సోర్సింగ్ ద్వారా ఎంపికైన అబ్దుల్ రెహ్మాన్, అక్కడ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలలుగా అతను హోమ్‌లోని బాలురపై తరచూ లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. దసరా పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన 14 ఏళ్ల బాలుడు అస్వస్థతకు గురవడంతో తల్లి ఆరా తీయగా, ఆ బాలుడు తనపై జరిగిన దాడి గురించి వివరించాడు.

తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన బయటపడింది. పోలీసులు బాలుణ్ని వైద్య పరీక్షలకు పంపగా, వైద్యుల నివేదికలో లైంగిక దాడి నిజమని తేలింది. అనంతరం ఇతర చిన్నారులపై కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు.

సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్, ఏసీపీ సోమ వెంకట్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ బండారు చంద్రమోహన్‌తో కలిసి జువెనైల్ హోమ్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడు అబ్దుల్ రెహ్మాన్‌పై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదే వ్యక్తిపై గతంలోనూ అసభ్య ప్రవర్తన ఆరోపణలు వచ్చినప్పటికీ, “ఇక తప్పు చేయను” అని హామీ ఇచ్చినందున అధికారులు మళ్లీ అతనిని విధుల్లో కొనసాగించారని సమాచారం. ఈ నిర్లక్ష్యం వల్లే మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జువెనైల్ హోమ్ మహిళా సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ షా వాలీ మాట్లాడుతూ, “ఈ ఘటన గురించి పోలీసులు చెప్పకపోతే మాకు తెలియదు” అన్నారు. దర్యాప్తు కోసం కాచిగూడ బాలికల సదనం సూపరింటెండెంట్ మైధిలీని నియమించారు. ఆమె మాట్లాడుతూ, “బాలుడిపై లైంగిక దాడి జరిగిన విషయం నిజమే. అన్ని వివరాలు సేకరించి నివేదిక అందజేస్తాం,” అని తెలిపారు.

సమాజం కోసం పునరావాసం కల్పించాల్సిన కేంద్రాలు ఈ స్థాయిలో నిర్లక్ష్యానికి, దారుణానికి వేదిక కావడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *