సంక్రాంతి రద్దీ వేళ రవాణా శాఖ దూకుడు.. 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన రవాణా శాఖ అధికారులు తనికీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా తదితర రాష్ట్రాలకు నడిచే స్లీపర్ బస్సులపై మూడు రోజుల పాటు ప్రత్యేక తనికీలు నిర్వహించారు.

ఈ నెల 7, 8 తేదీల్లో చేపట్టిన తనికీల్లో మొత్తం 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపింది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది ప్రత్యేక తనికీ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే స్లీపర్ బస్సుల నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకుని ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయరాదని రవాణా శాఖ హెచ్చరించింది. ప్రైవేట్ బస్సులను స్టేజ్ క్యారేజ్‌లుగా తిప్పరాదని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని తెలంగాణలో తిరుగుతున్న స్లీపర్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

పక్క రాష్ట్రాల్లో తక్కువ పన్నులు చెల్లించేందుకు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బస్సులు నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ విధానంతో రాష్ట్రానికి రావాల్సిన పన్నులు నష్టం వాటిల్లుతున్నాయని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని గతంలో కావేరి బస్ ట్రావెల్స్ అగ్ని ప్రమాదం సమయంలోనూ లేవనెత్తినట్లు తెలిపారు.

అటు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పండుగల సమయంలో టికెట్ ధరలను ఇష్టారీతిన పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా రూ.600 ఉండే టికెట్ ధరలు రూ.1500 నుంచి రూ.3000 వరకూ పెరిగాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో ప్రయాణించాల్సి వచ్చినవారికి మరింత భారంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సుల పేరిట ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులను దీర్ఘదూరాలకు నడిపిస్తూ అధిక ఛార్జీలు వసూలు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యం, భద్రత దృష్ట్యా తనికీలు నిరంతరం కొనసాగిస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *