16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: ఆస్ట్రేలియా చట్టాన్ని పరిశీలించాలన్న మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: 16 ఏళ్ల లోపు వారికి నిషేధం విధించాలన్న పిలుపు – మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా పూర్తిగా నిషేధించాలన్న డిమాండ్ బలపడుతోంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారం, దుష్భాష, అశ్లీల కంటెంట్ పిల్లల మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతోందని కోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా తీసుకొచ్చిన సోషల్ మీడియా నియంత్రణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కోర్టు సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా చిన్నారులు, కిశోర వయసు పిల్లలు సోషల్ మీడియా వల్ల మానసికంగా, సామాజికంగా తప్పుదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని స్కూల్స్ కూడా విద్యార్థులను సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేయమని ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అకౌంట్లు పెట్టుకోవాలని స్కూల్ స్థాయిలోనే సూచనలు ఇస్తున్నారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. లక్షలు లక్షలు ఫీజులు తీసుకునే పేరున్న ప్రైవేట్ స్కూల్స్ కూడా పిల్లలకు సోషల్ మీడియా వాడకం నేర్పించడం ఆందోళనకరమని విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే ఐదో, ఆరవ తరగతి చదువుతున్న పిల్లలే స్వయంగా సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నారు. దీన్ని కొందరు తల్లిదండ్రులు గొప్పగా భావించడం మరింత ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రీల్స్ స్క్రోల్ చేయడం, ట్రెండ్స్ ఫాలో అవడం చిన్న వయసులోనే అలవాటై, చదువు నుంచి దృష్టి మళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పాజిటివ్ కంటెంట్ కంటే నెగటివ్ కంటెంట్ ఎక్కువగా ప్రచారం అవుతోందని, అసభ్య పదజాలం, బూతులు, హింసాత్మక వీడియోలు సాధారణమైపోయాయని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ స్థాయిలో సరైన నియంత్రణ, ఫోకస్ లేకపోవడంతో “ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా పెట్టొచ్చు” అనే పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిన్న వయసు నుంచే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల్లో నెగటివ్ మైండ్‌సెట్ పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అబ్బాయిల్లో హింసాత్మక ఆలోచనలు, అమ్మాయిల్లో జంజీ కల్చర్, ఫేక్ ట్రెండ్స్ వైపు ఆకర్షణ పెరుగుతోందని చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో సామాజిక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇక టెలిగ్రామ్ యాప్ పరిస్థితి మరింత దారుణంగా మారిందని విమర్శలు ఉన్నాయి. డార్క్ వెబ్ కార్యకలాపాలు, అక్రమ కంటెంట్ ఎక్కువగా టెలిగ్రామ్ ద్వారా నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మాయిలను ట్రాప్ చేయడం, బ్లాక్‌మైలింగ్ వంటి ఘోర ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం ఏ యాప్ కూడా పూర్తిగా సేఫ్, సెక్యూర్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ కాల్స్, చాట్స్, సోషల్ మీడియా యాక్టివిటీ—ప్రతి కదలిక రికార్డ్ అవుతోందని, భవిష్యత్తులో బ్లాక్‌మైల్ చేసే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో చిన్న పిల్లలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఎంత వీలైతే అంతవరకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని కోర్టులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టాలకంటే ముందుగా తల్లిదండ్రుల అవగాహన, నియంత్రణ అత్యంత కీలకమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *