ప్రైవేట్ స్కూల్ ఫీజులపై కట్టడి: బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకురానున్న ప్రభుత్వం

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ స్కూల్లు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై భారం మోపుతున్న నేపథ్యంలో ప్రత్యేక చట్టం తీసుకురావడానికి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.

ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ఆ నివేదికలో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం “తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్” ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సిఫారసును ఆధారంగా చేసుకొని ప్రత్యేక బిల్లును రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

రాష్ట్రంలో అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు సదుపాయాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్యతో సంబంధం లేకుండా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. కొన్ని పెద్ద విద్యా సంస్థలు ఒక్క రకమైన మాఫియాగా మారి ప్రతి సంవత్సరం ఫీజులను భారీగా పెంచుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాటిని అనుసరించి ఇతర స్కూల్లు కూడా అదే విధంగా ఫీజులను పెంచుతున్నాయని అంటున్నారు.

ఈ సమస్యపై తల్లిదండ్రులు పలుమార్లు ఆందోళనలు చేసినా పెద్దగా ఫలితం రాలేదు. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం చట్టపరమైన వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతం బిల్లును సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. సాంకేతిక సమస్యలు లేకపోతే బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.

అయితే ఈ నిర్ణయంపై కొన్ని కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తబడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదా వారి అనుచరుల ఆధీనంలో ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడం ఎంతవరకు సాధ్యమవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యా రంగంలో ఏర్పడిన ఈ ఫీజుల సిండికేట్‌ను ప్రభుత్వం నిజంగా నియంత్రించగలదా? లేక చట్టం కేవలం కాగితాలకే పరిమితమవుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం బడ్జెట్ సమావేశాల తర్వాతే స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *