వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టౌన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
వికారాబాద్ పట్టణంలోని 34 వార్డుల్లో ప్రస్తుతం 32 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక సిబ్బందితో పాటు అదనపు బలగాలను కూడా వినియోగించి పోలింగ్ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మకుండా నిర్భయంగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని సూచించారు. గతంలో ఓటింగ్ ఒక పండుగలా ఉండేదని, ప్రస్తుతం పోలింగ్ శాతం తగ్గడం బాధాకరమని అభిప్రాయపడ్డారు.
పట్టణంలో 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు పోలీస్ బలగాలు, ఆర్మ్డ్ ఫోర్స్, ప్రత్యేక దళాలను మోహరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఏదైనా అనుమానం లేదా సమస్య ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం సుమారు 200 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రజల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

