ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ప్రశ్నించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందని, కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు.
అయితే ఇదే ప్రశ్నను బీజేపీపై వేసుకుంటే పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సీబీఐ విచారణకు అప్పగించాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ, చివరకు కేంద్రం ద్వారా సీబీఐకి కేసు అప్పగించింది. కానీ సీబీఐ విచారణ మొదలై చాలా కాలం గడిచినా ఇప్పటివరకు ఏం తేలింది? కేసీఆర్ పాత్ర ఉందన్న స్పష్టమైన ఆధారం ఒక్కటైనా బయటకు వచ్చిందా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నాలుగు బృందాలు విచారణ చేసి నాలుగు నివేదికలు ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ ఆ నివేదికల్లో ఏముందో, ఎవరి మీద బాధ్యత వేశారో ప్రజలకు తెలియదు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పే అంశం ఇప్పటివరకు అధికారికంగా బయటకు రాలేదు. అలాంటప్పుడు “ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?” అని ప్రశ్నించడం రాజకీయ విమర్శకే పరిమితమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్న అంశం. విచారణ, అరెస్టులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. అలాంటి పరిస్థితిలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కాకుండా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సీబీఐ విచారణలో ఇప్పటివరకు ఏం సాధించిందో ముందుగా చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
శుక్రవారం రాత్రి జగిత్యాల మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో రామచంద్రరావు మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ” అంటూ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కేసీఆర్ను జైలుకు పంపుతానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, కనీసం ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించలేదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
అయితే రాజకీయ పరిశీలకుల అభిప్రాయం వేరుగా ఉంది. మూడు ప్రభుత్వాలు – కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ – ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, చివరకు ఎవ్వరూ స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అరెస్టుల పేరుతో రాజకీయ లాభాలు పొందాలన్న ప్రయత్నాలు తప్ప, చట్టపరమైన నిర్ణయాలు కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కేసీఆర్ అరెస్ట్ అంశం చట్టపరంగా బలమైన ఆధారాలపై ఆధారపడి ఉండాల్సిన విషయం. కానీ రాజకీయ వేదికలపై ప్రశ్నలుగా మాత్రమే మిగిలిపోతే, అది ప్రజల్లో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

