సినీ కార్మికుల శ్రమకు ప్రభుత్వం అండగా – ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

సినీ పరిశ్రమ అభివృద్ధిలో సినీ కార్మికుల త్యాగం, శ్రమను గుర్తిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా స్పందించారు. సినీ కార్మికుల సమస్యలపై కృష్ణానగర్‌లో జరిగిన భారీ సమావేశంలో పాల్గొన్న ఆయన, పలు ముఖ్యమైన హామీలను ప్రకటించారు.

“ఈనాడు టాలీవుడ్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేది మీరు కార్మికులే. మీ కష్టమే ఈ పరిశ్రమకు బలం,” అంటూ ముఖ్యమంత్రి అన్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించిన సీఎం, “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ చేర్చనున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌ పరిసరాల్లోని శంషాబాద్ సమీపంలో 30 వేల ఎకరాల్లో “భారత్ ఫ్యూచర్ సిటీ” రూపుదిద్దుకోనుందని, అందులో సినీ కార్మికులకు గృహాలు, ప్రాక్టీస్ స్థలాలు, స్టూడియో సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే, సినీ కార్మికుల పిల్లల కోసం ఉచిత విద్యా పథకం, కార్పొరేట్ స్థాయి పాఠశాల, రోజువారీ ఉచిత బ్రేక్‌ఫాస్ట్, పాలు, మధ్యాహ్న భోజనం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రత్యేక వైద్య సహాయం, ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

సినీ కార్మికుల సంక్షేమ నిధి కోసం 10 కోట్ల రూపాయల వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, భవిష్యత్తులో సినిమా టికెట్ ధరలు పెంపు జరిగితే, ఆ అదనపు ఆదాయంలో 20% కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కి కేటాయించాలనే కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

“మీ శ్రమతోనే తెలుగు సినిమా నిలబడింది. మీకు వాటా ఉండాలి, గౌరవం ఉండాలి,” అంటూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్ల భవనాల నిర్మాణానికి స్థల కేటాయింపు, ఆర్థిక సహాయం, ఫైటర్స్ మరియు టెక్నీషియన్ల కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటు వంటి అంశాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు.

“నేను ముఖ్యమంత్రిగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడ ఉన్నాను,” అంటూ కార్మికులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభను ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *