సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో అందించిన మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంను కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ఈ ఘటనకు సంబంధించి “వికటించిన మధ్యాహ్న భోజనం – 22 మంది విద్యార్థులు అస్వస్థ” అనే శీర్షికతో దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హెచ్ఆర్సీ జుడిషియల్ సభ్యులు శివాజీ ప్రవీణ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. పూర్తి నివేదికను 2026 ఫిబ్రవరి 24 నాటికి కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, గ్రామంలో జరిగిన ఒక ప్రైవేట్ విందులో మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకువచ్చి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా పెట్టిన కారణంగానే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయం నిజమైతే అది తీవ్రమైన నేరమని కమిషన్ స్పష్టం చేసింది.
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు పదే పదే జరుగుతున్నా, వాటికి శాశ్వత పరిష్కారం కనిపించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయిస్తుండగా, ముడి సరుకులు కొనుగోలు, రోజువారీ మెనూ వంటి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బయట నుంచి ఆహారం తీసుకురావడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా పేర్కొనబడుతోంది.
ఈ ఘటనతో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటేనే అనుమానం కలిగే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యమేనని విమర్శలు ఉన్నాయి.
ప్రైవేట్ విందుల్లో మిగిలిన భోజనాన్ని పిల్లలకు పెట్టడం వెనుక నిధులు మిగిల్చుకోవాలన్న దురుద్దేశం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది పిల్లల ప్రాణాలతో ఆడుకోవడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది మొదటిసారి జరిగిన ఘటన కాదని, ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండే అవకాశముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బాధ్యులపై తక్షణమే సస్పెన్షన్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలుపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పిల్లల ప్రాణాలు నిర్లక్ష్యానికి బలికాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్ఆర్సీ చర్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

