తెలంగాణ భూభారతి పోర్టల్‌లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి భూభారతి వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ సరిగా పనిచేయడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా వివరాలు సరిగ్గా నమోదు చేసినా లాగిన్ కాకపోవడం, రెండు నిమిషాల్లో ఓటీపీ వస్తుందని మెసేజ్ కనిపించినా ఓటీపీ రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
దీంతో స్లాట్ బుక్ చేసుకోవడం, అప్లికేషన్లు సమర్పించడం, ఇప్పటికే బుక్ చేసుకున్న స్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం కూడా కష్టంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
22A సమస్యలకు తోడు పోర్టల్ సమస్యలు
ఇప్పటికే 22A నిషేధిత భూముల జాబితా అంశం రైతులు, భూయజమానులు, రెవెన్యూ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శలు ఉన్నాయి. నిషేధిత జాబితాలో తప్పులు, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ బీఆర్‌ఎస్, బీజేపీ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో భూభారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు రావడం మరింత ఆందోళనకు కారణమవుతోంది.
పోర్టల్‌లో తరచూ సాంకేతిక లోపాలు ఎందుకు వస్తున్నాయన్న ప్రశ్నకు అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెబ్‌సైట్‌లో ఏమైనా మార్పులు, అప్‌డేట్లు జరుగుతున్నాయా అని అడిగినా స్పష్టత లేదని వినియోగదారులు చెబుతున్నారు.
8 రోజుల్లోనే వేల అప్లికేషన్లు పెండింగ్?
సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 40 శాతం పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సంబంధించి మొత్తం 12,804 దరఖాస్తులు రాగా, అందులో 7,579 మాత్రమే పూర్తయ్యాయని సమాచారం.
అంటే గణనీయమైన సంఖ్యలో దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నమాట.
సక్సెషన్ ఫైల్స్‌లో మరింత ఆలస్యం
సక్సెషన్ దరఖాస్తుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. మొత్తం 1,680 దరఖాస్తులు రాగా, వాటిలో కేవలం 2 మాత్రమే పూర్తయ్యాయని సమాచారం. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తుల్లో కూడా పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
మరోవైపు ఆదాయం వచ్చే NALA కన్వర్షన్ దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 1,278 NALA దరఖాస్తుల్లో 723 పూర్తయ్యాయని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
సిబ్బంది కొరత లేకపోతే ఆలస్యం ఎందుకు?
భూభారతి ఆపరేటర్లలో కొందరిని తొలగించి, వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. వారికి సంబంధిత ప్రక్రియలపై అవగాహన ఉన్నప్పుడు సిబ్బంది కొరత కారణంగా ఆలస్యం జరుగుతోందన్న వాదనకు అవకాశం లేదని విమర్శకులు అంటున్నారు.
రోజుకు ఎన్ని లావాదేవీలు పూర్తి చేయగలరన్న దాని ఆధారంగా స్లాట్లు కేటాయిస్తున్నప్పటికీ, కేటాయించిన స్లాట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు, సక్సెషన్లు, NALA కన్వర్షన్లు ఎందుకు పూర్తికావడం లేదన్నది ప్రశ్నగా మారింది.
‘ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?’
ఒకవైపు 22A సమస్యతో తమ భూమి రేపు నిషేధిత జాబితాలోకి వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి ఉందని భూయజమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భూభారతి పోర్టల్ పనిచేయకపోవడంతో తమ సమస్యలను పరిష్కరించుకునే మార్గం కూడా కనిపించడం లేదని వాపోతున్నారు.
తమ భూమి 22Aలోకి వెళ్తుందా? HYDRA పరిధిలోకి వస్తుందా? అసలు తమ భూమి పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొంగులేటి హామీలపై మళ్లీ ప్రశ్నలు
భూభారతి సమస్యలపై గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితిపై స్పష్టమైన పురోగతి ఏమిటన్న దానిపై ప్రజలకు సరైన సమాచారం అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
“అవుతుంది.. అవుతుంది” అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని, అసలు సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని బాధితులు అంటున్నారు.
22A సమస్యలకు తోడు భూభారతి పోర్టల్ సాంకేతిక లోపాలు, పెండింగ్ దరఖాస్తులు, సక్సెషన్, NALA ఫైళ్లలో జాప్యం.. ఇవన్నీ కలిసి భూముల వ్యవహారంలో ప్రజలకు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

