బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు షాక్.. 20 మందికి పైగా సస్పెన్షన్‌! అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. అసెంబ్లీ రూల్స్‌లోని రూల్‌ 340 సబ్‌రూల్‌ 2 కింద స్పీకర్‌ పేర్లు ప్రకటించిన సభ్యులను ప్రస్తుత సమావేశాల మిగిలిన కాలానికి సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.

ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులు “అయ్” అని చెప్పాలని, వ్యతిరేకంగా ఉన్నవారు “నో” అని చెప్పాలని స్పీకర్‌ కోరారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు.

స్పీకర్‌ ప్రకటించిన జాబితాలో అనిల్‌ యాదవ్‌, తన్నీరు హరీశ్‌రావు, జి. జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, కౌకుంట్ల మాణిక్‌రావు, చింతా ప్రభాకర్‌, కోటా ప్రభాకర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మారి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు, కాలే వెంకటేశ్‌, విజయుడు, కె.పి. వివేకానంద తదితరుల పేర్లు ఉన్నాయి.

సభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లడం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారపక్షం పేర్కొంది.

తీర్మానం ఆమోదం పొందిన అనంతరం సభను 10 నిమిషాల పాటు టీ బ్రేక్‌ కోసం వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌తో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇప్పటికే స్పీకర్‌ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా సస్పెన్షన్‌ నిర్ణయం మరింత చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *