హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్ బాధితుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తమైంది. సాధారణ జ్వరానికి కూడా వేల రూపాయల పరీక్షలు, వైద్య ఖర్చులు విధిస్తున్నారని ఎమ్మెల్యే విజయశాంతి ప్రత్యేక ప్రస్తావన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
సాధారణంగా జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ప్రజలు సమీపంలోని చిన్న ఆస్పత్రులు, వైద్యులను సంప్రదిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జ్వరం తగ్గకపోతే పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్కాన్లు, ఎక్స్‌రేలు తదితర పరీక్షల పేరుతో రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని విజయశాంతి తెలిపారు.
సాధారణ జ్వరానికి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజే రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారని ఆమె సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రమాదాలు, గుండెపోటు, కిడ్నీ, లివర్ సమస్యలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులు లక్షల్లోకి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరోగ్యం వ్యాపారంగా మారిందా?
వైద్య రంగం సేవా రంగంగా ఉండాల్సిందిపోయి వ్యాపారంగా మారుతోందని విజయశాంతి విమర్శించారు. విద్య, వైద్యం రెండూ వ్యాపారాలుగా మారడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల ఛార్జీలపై నియంత్రణ ఉండాలని, ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రజలు ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి రావడం సరికాదన్నారు.
పేదల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
సభలో మరో సభ్యుడు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనవసర పరీక్షలు, చికిత్సల పేరుతో ప్రజలపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో రోగి మరణించిన తర్వాత కూడా వెంటిలేటర్‌పై ఉంచి అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు.
నల్గొండలోని ఓ ఆస్పత్రిపై వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల నిర్వహించిన తనిఖీలను కూడా ప్రస్తావించారు. ఆ ఆస్పత్రి నిర్వహణ, మరణాల సంఖ్యపై వచ్చిన అంశాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
RMPలు, అంబులెన్సులపై ఆరోపణలు
ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితుల్లో.. కొందరు అంబులెన్స్ సిబ్బంది కమిషన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారనే ఆరోపణలు కూడా సభలో వినిపించాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పేద కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని, చివరకు మహిళలు తమ మంగళసూత్రాలు సైతం అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి
ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడకుండా ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సభ్యులు కోరారు.
NIMS, TIMS, జిల్లా బోధన ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని సూచించారు. మౌలిక వసతులు, మానవ వనరులు, డయాగ్నస్టిక్స్, మందులు, వైద్య పరికరాలు అనే ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తే ప్రజలు సహజంగానే ప్రభుత్వ వైద్య సేవలను ఆశ్రయిస్తారని అభిప్రాయపడ్డారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంతో నియంత్రణ
ప్రైవేట్ ఆస్పత్రుల నియంత్రణకు రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం అమల్లో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, కలెక్టర్లు, టాస్క్‌ఫోర్స్ ద్వారా ఆస్పత్రులపై పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.
ఆస్పత్రుల్లో రికార్డుల నిర్వహణ, వైద్యుల వివరాల ప్రదర్శన, సంబంధిత నిబంధనల అమలు వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. PCPNDT చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంతో పాటు IVF, IUI, ART కేంద్రాలపైనా నియంత్రణ అవసరమని స్పష్టం చేసింది.
ప్రైవేట్ వైద్య రంగంపై మరింత కఠినంగా పర్యవేక్షణ చేపట్టేందుకు అదనపు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఆరోగ్య రంగంపై సభ్యులు మరిన్ని అంశాలను ప్రస్తావించేందుకు ప్రత్యేకంగా స్వల్పకాలిక చర్చ చేపడతామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడంతో పాటు, అనవసర ఖర్చులు మరియు అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడేలా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సభలో వ్యక్తమైంది.

