జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాజకీయ వేడి పెరుగుతున్న క్రమంలో, అన్ని పార్టీలూ విస్తృత ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న పావని గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజల్లో బిఆర్ఎస్ పట్ల విశ్వాసం ఇంకా బలంగానే ఉందని, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ప్రజానీకం గట్టి మద్దతు ఇస్తోందని ఆమె అన్నారు. గోపీనాథ్ లేని లోటు ఉన్నప్పటికీ, ఆయన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్లో నీటి పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత బంధు, బీసీ బంధు, శాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం చేసిన సేవలను ఆమె గుర్తుచేశారు.
ఈ ఉపఎన్నికలో కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం తప్పుడు ధోరణి అని, గోపీనాథ్ భార్య నిలబడ్డ ఈ ఎన్నికలో బిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రచార శక్తి సన్నగిల్లిపోయిందని, ప్రతిపక్షం ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజలే తేడా గమనిస్తున్నారని, జూబ్లీహిల్స్ ప్రజలకు రౌడీ రాజ్యం అవసరం లేదని పావని గౌడ్ వ్యాఖ్యానించారు.
అలాగే, మైనారిటీలకు కేసీఆర్ ప్రభుత్వమే ఎప్పటికీ మద్దతుగా నిలిచిందని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని అన్నారు.
చివరగా, ఈ ఉపఎన్నికలో బిఆర్ఎస్ విజయం ఖాయమని, ప్రతి గల్లీలో కారుకే మద్దతు ఉందని నమ్మకం వ్యక్తం చేశారు.

