కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ ప్రజల సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. “ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు కనిపిస్తారు, తరువాత మాత్రం ఎవరూ పట్టించుకోరు” అంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గల్లీల్లో నీటి పెంగులు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ప్రబలంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని, పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలో నీరు చేరి పిల్లలు, పెద్దలు రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లు పాలించినా పరిస్థితి మారలేదని, కొత్త ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు ఎలాంటి మార్పు కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతుగా చెప్పిన పథకాలు కూడా తమకు అందడం లేదని తెలిపారు. “జీరో బిల్ లేదు, సిలిండర్ సబ్సిడీ లేదు, ఏ పథకం ప్రయోజనం మాకు చేరలేదు” అని ఒక మహిళ చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
నాయకులు ఓట్లు కావాలంటే వస్తారు, కానీ మా గల్లీల్లో ఒకరోజు జీవించే ధైర్యం వారిలో లేదు” అంటూ ప్రజలు చురకలు వేశారు. ఏ పార్టీ వచ్చినా తమ సమస్యలు అలాగే ఉండిపోయాయని, ఈ ఉప ఎన్నికలో ఎవరికీ హామీలు వినడం కాక, అభివృద్ధి చూపించాలని కోరారు.
ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు:
“రోడ్లు, డ్రైనేజ్, ఆరోగ్యం — ఇవి సరి చేయకుండా ఎవరికీ ఓటు ఇవ్వం.”
కంటోన్మెంట్ ప్రజలకు ఒకే డిమాండ్ — మాటలు కాదు, పనులు కావాలి.

