తెలుగు సాహిత్య లోకానికి మరో తీవ్ర విషాదం తలెత్తింది. తెలంగాణ ప్రముఖ కవి అందశ్రీ గారు నిన్న ఉదయం హఠాన మరణం చెందారు. ఆయన ఆకస్మిక మరణం తెలుగు కవితా ప్రపంచాన్ని, సాహిత్యాభిమానులను తీవ్రంగా కలచివేసింది.
వార్త తెలిసిన వెంటనే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కవులు, అభిమానులు అందరూ ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. అందశ్రీ గారి మరణం ఎవరికీ ఊహించని ఘటనగా మారింది.
తెలుసుకున్న వివరాల ప్రకారం, గత ఒక నెల రోజులుగా ఆయన బీపీ టాబ్లెట్‌లు వాడటం మానేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణంగా యాంజైటీ ఎక్కువగా ఉండే ఆయన, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు లేదా తన కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎమోషనల్ అవుతారని తెలిసింది. బీపీ మందులు మానేయడం కూడా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
మరణానికి ముందు రోజు కూడా ఆయన తన కొత్త ఇల్లు నిర్మాణ పనులు పరిశీలించి, మేస్త్రీలకు సూచనలు ఇచ్చారని సమాచారం. ఇల్లు పూర్తి కాకముందే ఆయన ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరం.
అందశ్రీ గారి అంత్యక్రియలు ఇవాళ గట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఆయన సొంత విల్లా ఫార్మ్‌హౌస్ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుమార్తె వేరే రాష్ట్రంలో ఉండటంతో, ఆమె రావడానికి సమయం కావడంతో అంత్యక్రియలు ఒక రోజు వాయిదా వేశారు.
తెలంగాణ సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన కవిత్వం, భాష, భావోద్వేగం ప్రతి పాఠకుడిని స్పృశించింది. కవులలో మహాకవి అని పేరొందిన అందశ్రీ గారి అకాల మరణం తెలుగు ప్రజలందరికీ తీరని లోటు.

