జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులు తమ సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు ఉద్యోగాలు, గ్యారంటీలు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే హామీలను విస్మరించడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసిందని అభిప్రాయపడ్డారు. “రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేకపోయారు. 40 లక్షల నిరుద్యోగుల కోసం నేను పనిచేస్తానని చెప్పినా, ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా విడుదల కాలేదు” అని నిరుద్యోగులు వ్యాఖ్యానించారు.
ఇక బిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “1200 మంది అమర వీరుల త్యాగంతో తెలంగాణ ఏర్పడింది, కానీ ఆ త్యాగాలను గుర్తుచేసుకునే నాయకులు కనబడటం లేదు” అని వారు పేర్కొన్నారు.
నిరుద్యోగుల ఆవేదనతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంది. కానీ ఇప్పుడు ఆ హక్కు కూడా కుదించబడుతున్నదనే అనిపిస్తోంది. ఇది ప్రజా ప్రభుత్వమా లేక అధికార రాజకీయమా అనే సందేహం కలుగుతోంది” అని పొలిటికల్ అనలిస్ట్ డా. శివప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలను కూడా ఆలోచనలో పడేలా ప్రశ్నించారు: “హైదరాబాద్, జూబ్లీహిల్స్ వంటి విద్యావంతుల ప్రాంతాల్లో కూడా పోలింగ్ శాతం తక్కువగా ఉండటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం. దాన్ని సరిగ్గా వినియోగించుకోవాల్సిన బాధ్యత మనందరిదే.”
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన త్రికోణ పోరులో ఎవరు ముందంజలో ఉంటారో అన్న ఆసక్తి పెరుగుతోంది. అయితే, నిరుద్యోగుల విసుగు, ప్రజల అసంతృప్తి, తక్కువ పోలింగ్ శాతం వంటి అంశాలు రాబోయే ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీ “ఓట్ల దొంగతనం జరుగుతోంది” అంటూ చేసిన వ్యాఖ్యలు, అధికార పార్టీపైనే కాదు, మొత్తం ఎన్నికల నమ్మకంపై కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును ఎంత సమర్థంగా వినియోగిస్తారన్నది చూడాలి.

