సాయి ఈశ్వర్ మృతి పై బీసీ సంఘాల ఆందోళన : తీన్మార్ మల్లన్న సహా పలువురి అరెస్ట్

మెడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని అగ్ని పెట్టుకున్న సాయి ఈశ్వరాచారి, గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ కుటుంబ పోషణ కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మరణ వార్త తెలిసిన వెంటనే బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కుల సంఘాల జేఏస్సీ చైర్మన్ కుందారం గణేశాచారి తో పాటు వందలాది మంది గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు.

ఆందోళనకారులు “సాయి మృతికి కాంగ్రెస్-బీజేపీ ప్రభుత్వాలే కారణం” అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ:

“స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోవడం వల్లే సాయి ప్రాణాలు తీసుకున్నాడు. ఇది సాధారణ ఆత్మహత్య కాదు — ఇది ప్రభుత్వాలే చేసిన హత్య” అని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనపై బాధ్యత వహించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *