జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార సభలో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటీ నెరవేరలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మహిళలకు ₹2,500, వృద్ధులకు ₹4,000, నిరుద్యోగులకు భృతి, మహాలక్ష్మి పథకం, ఇళ్ల నిర్మాణ హామీలు అన్నీ కేవలం ఎన్నికల వాగ్దానాలుగానే మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ “ఇళ్లను కూల్చివేసి, పేదలను వీధులపైకి నెట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం” అని అన్నారు.
కెసిఆర్ పాలనలో పేదల కోసం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, “ఇంటి బిల్లు మాఫీ”, “ఫ్రీ వాటర్ స్కీమ్” లను తొలగించే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు విజయం సాధింపజేయాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌ను ఓడిస్తేనే తెలంగాణలో మళ్లీ సంక్షేమ యుగం వస్తుందని తెలిపారు.
అలాగే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హామీలను నెరవేర్చడంలో విఫలమైనదని, తాను ఇచ్చిన మాటలతో ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేదల జీవన ప్రమాణాలను దిగజార్చిందని, తెలంగాణ రాష్ట్రాన్ని బుల్డోజర్ రాజకీయాల దిశగా నడిపిస్తోందని వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి “కారు” గుర్తుకు ఓటు వేస్తేనే తెలంగాణలో మళ్లీ అభివృద్ధి సాధ్యమని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

