జూబ్లీ హిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడంతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఆమె కుమార్తె శ్వేత యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
“మా అమ్మ మినిస్టర్. ఆమెపై ఇలా పోలీసులు దాడి చేయడం దారుణం. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య. మేము కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి లాయల్‌గా ఉన్నందుకే ఇలా జరుగుతోంది” అని శ్వేత అన్నారు.
శ్వేత యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె తండ్రి కొండా మురళి మాజీ మావోయిస్టు, ఇప్పుడు పూర్తిగా మారిన నాయకుడు. ఆయనను ఒక ఎక్స్టార్షన్ కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.
ఆమె మాటల్లో —
“మా తండ్రి పేరు మీద ఎక్స్టార్షన్ కేసు పెట్టి, ఆర్మ్స్ యాక్ట్ కింద ఇరికించాలనే యత్నం జరుగుతోంది. ఈ కుట్ర వెనుక రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేమ నరేందర్ రెడ్డి ఉన్నారు” అని శ్వేత యాదవ్ అన్నారు.
అలాగే మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఉపయోగించి తప్పుడు కంప్లైంట్ తయారు చేశారని కూడా ఆమె ఆరోపించారు.
“ఉత్తమ్ రెడ్డి గారు స్వయంగా నాకు చెప్పారు – నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది పూర్తిగా సిఎంఓ నుండి ప్లాన్ అయింది” అని పేర్కొన్నారు.
శ్వేత వ్యాఖ్యల్లో మరో కీలక అంశం — “రోహిణి రెడ్డి అనే వ్యక్తి సిఎంఓ నుంచి ఆదేశాలు తీసుకుని మా సుమంత్(ఓఎస్డీ) ని పిలిచి డెక్కన్ సిమెంట్స్ అంశంపై చర్చ చేశాడు. ఆ చర్చే ఇప్పుడు ఎక్స్టార్షన్ కేసుగా మారింది” అని ఆమె అన్నారు.
మా నాన్న, మా అమ్మకు ఏమైనా హాని జరిగితే, దానికి బాధ్యులు సీఎం రేవంత్ రెడ్డి, వేమ నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి” అని ఆమె హెచ్చరించారు.
శ్వేత చివరగా డిమాండ్ చేశారు —
“ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినట్టుగా చెబుతున్న కంప్లైంట్ పేపర్ మాకు చూపాలి. అదికాకుండా పోలీసులు మా ఇంటిపై దాడి ఎందుకు చేశారో వివరించాలి” అని అన్నారు.

