దేశంలో ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయించే కంపెనీలకు గట్టి హెచ్చరికగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్‌లపై “ORS” (Oral Rehydration Salts) అనే పదాన్ని వాడకూడదని స్పష్టం చేసింది.
డీహైడ్రేషన్ నివారణ పేరుతో మార్కెట్లో లభిస్తున్న కొన్ని పానీయాలు వాస్తవ ఓఆర్ఎస్ ఫార్ములాతో సంబంధం లేకుండా, దానికంటే పది రెట్లు ఎక్కువ చక్కెర కలిగి ఉన్నట్లు బయటపడింది. ఈ అధిక చక్కెర కారణంగా పిల్లల్లో డయేరియా మరింత తీవ్రమవ్వడం, డయాబెటిస్ రోగుల్లో కోమాకు దారి తీయడం వంటి ప్రమాదాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరించారు.
ఈ సమస్యపై గత ఎనిమిదేళ్లుగా పోరాటం సాగించిన డాక్టర్ శివరంజని సంతోష్, వినియోగదారుల భద్రత కోసం నిరంతరం శ్రమించారు. ఆమె పలు సార్లు FSSAI, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, WHO, UNICEF వంటి సంస్థలకు ఫిర్యాదులు, పిటిషన్లు సమర్పించారు. చివరికి ఆమె కృషికి ఫలితం దక్కింది.
ఇప్పుడిప్పుడే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం,
➡️ “ORS” అనే పదాన్ని కేవలం వైద్యపరంగా ఆమోదించబడిన రిహైడ్రేషన్ ఉత్పత్తులపైనే వాడాలి.
➡️ వాణిజ్య పానీయాలు, చక్కర పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిపై ఈ పదం వాడకూడదు.
డాక్టర్ శివరంజని మాట్లాడుతూ –
“ఇది మోసపూరిత లేబులింగ్, వినియోగదారుల ప్రాణాలతో ఆట. ఇప్పుడు ఎట్టకేలకు సత్యం గెలిచింది. ఇకపై పిల్లలు, పెద్దలు ఈ తప్పుడు పానీయాల వల్ల ప్రాణాలు కోల్పోవడం ఆగిపోతుంది,” అని అన్నారు.
ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆరోగ్య నిపుణులు కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయాన్ని చారిత్రాత్మకమైన అడుగుగా పేర్కొన్నారు.

