మూసీ పైన ఆదిత్య వాంటేజ్ నిర్మాణం — నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులు, అధికారులు మౌనం ఎందుకు?

హైదరాబాద్ నగరంలో మరో పెద్ద నిర్మాణ వివాదం చర్చనీయాంశమైంది. గండిపేట మండలం, నార్సింగ్ సర్కిల్ పరిధిలోని మూసీ నది ఒడ్డున శ్రీ ఆదిత్య వాంటేజ్ ప్రాజెక్టు నిర్మాణం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు, సామాజిక సంస్థలు — అందరూ ఒక్కటే ప్రశ్నిస్తున్నారు: “మూసీ బఫర్ జోన్‌లో ఇంత భారీ నిర్మాణం ఎవరికి అనుమతి ఇచ్చారు?”

ఆరోపణల ప్రకారం, ఈ నిర్మాణం నాలా పైనే, మూసీ బఫర్ జోన్‌లోనే కొనసాగుతోంది. వర్షాకాలంలో గండిపేట జలాశయం గేట్లు ఎత్తినప్పుడు, నీటంతా ప్రాజెక్టు ప్రాంతంలోకి చేరింది. ఒకవేళ ఈ నిర్మాణం పూర్తయి ప్రజలు నివసించే స్థితికి వస్తే, వారి ప్రాణ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంత స్పష్టమైన ఆధారాలు, ఫోటోలు, సర్వే రికార్డులు ఉన్నా కూడా హెచ్ఎండిఏ కమిషనర్ రంగనాథ్ గారి వైఖరి పై ప్రశ్నలు లేవుతున్నాయి. చిన్న నిర్మాణాలు అయితే వెంటనే కూల్చివేస్తూ, పెద్ద ప్రాజెక్టుల విషయంలో మాత్రం “కోర్టు కేసు ఉంది, పరిశీలనలో ఉంది” అంటూ చర్యలు వాయిదా వేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్లో హైడ్రా కమిషనర్ పర్యటన కూడా ఈ ప్రాజెక్టు చుట్టూ జరిగినప్పటికీ, అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇదంతా రాజకీయ ప్రభావం, ఉన్నత స్థాయి ఒత్తిళ్లు ఉన్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు.

ప్రజల అభిప్రాయం ప్రకారం,

“పేదల ఇల్లు కంచె వేసినా గంటలో కూల్చేస్తారు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు నదిపై కట్టినా అధికారులు ఏమీ చేయరు. ఇది న్యాయమా?”

ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద కోర్టు కేసు పెండింగ్‌లో ఉందని సమాచారం. అయినప్పటికీ, అక్కడ పనులు కొనసాగుతున్నాయి. ఇది కేవలం పర్యావరణానికి కాకుండా భవిష్యత్‌లో ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలకు హెచ్చరిక:

ఇలాంటి బఫర్ జోన్ లేదా నది పరిధిలోని లేఅవుట్లలో స్థలాలు కొనకండి. రేపటి వరదల సమయంలో అది మీ జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *