జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహరచన, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.
సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు వర్గాలు చెబుతున్నాయి.
ఇక కాంగ్రెస్ పక్షాన అభ్యర్థి నవీన్ యాదవ్ బలమైన మాస్ ఫాలోయింగ్ కలిగి ఉండటంతో పోటీ ఉత్కంఠభరితంగా మారింది. మరోవైపు, బీజేపీ పరిస్థితి బలహీనంగా కనిపిస్తోంది. ప్రధానంగా బిఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యే అసలు పోటీ నెలకొన్నది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఎన్నికలో గెలుపోటములు 5,000–10,000 ఓట్ల తేడాలోనే నిర్ణయమయ్యే అవకాశం ఉంది.
టిడిపి ఓటు బ్యాంక్, సెట్లర్ ఓట్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి. గతంలో మాగంటి గోపినాథ్ విజయానికి కూడా ఈ ఓట్లు కారణమని చెబుతారు. ప్రజలు ఇప్పటికే తమ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉపఎన్నిక ముగిసే వరకు కెసిఆర్ జూబ్లీహిల్స్ పరిధిలోనే ఉంటారని టాక్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తారసపడ్డ పోరు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.

