టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై అంచనాలను అందుకుని దూసుకుపోతోంది.
ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా ఈ సినిమా ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవితో పాటు మూవీ టీమ్ అంతా హ్యాపీ మూడ్‌లో ఉంది. ముఖ్యంగా ‘భోళాశంకర్’ తర్వాత ఈ సినిమా చిరంజీవికి బలమైన కమ్‌బ్యాక్‌గా నిలిచిందనే చెప్పాలి.
ఇదిలా ఉండగా, చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్‌ను యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లితో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో చిరును ఫుల్ మాస్ రోల్‌లో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవికి సూపర్ హిట్ అందించిన బాబీ, ఈసారి అంతకుమించి స్థాయిలో సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
అయితే బాబీ కొల్లి సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే చిరంజీవి మరో కీలక ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ పనులపై కూడా పూర్తి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ గత ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పటికి పనులు పూర్తికాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది.
ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన రెండో గ్లింప్స్ మాత్రం పర్లేదనిపించుకోగా, ఫస్ట్ టీజర్‌కు మాత్రం భారీగా విమర్శలు ఎదురయ్యాయి. అలాగే విడుదలైన పాట కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ కారణాలతో సినిమా మీద కొంత నెగటివ్ బజ్ కూడా ఏర్పడింది.
అయినా సరే, సినిమా తప్పకుండా అలరించేలా చేయడానికి మూవీ టీమ్ గత కొన్ని నెలలుగా కష్టపడుతోందని సమాచారం. విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. వేసవి విడుదలకు ‘విశ్వంభర’ను రెడీ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్.
ఇక్కడే చిరంజీవికి అసలైన పెద్ద టాస్క్ మొదలైంది. తాజాగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ అందరిలోనూ చిరుపై కొత్త జోష్ నింపింది. ఇప్పుడు అదే హైప్‌ను ‘విశ్వంభర’ కొనసాగించాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి. అందుకే చిరంజీవి స్వయంగా దగ్గరుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తూ, ప్రేక్షకులను మెప్పించేలా ప్లానింగ్ చేస్తున్నారని సమాచారం.
మొత్తానికి, ‘విశ్వంభర’ చిరంజీవి కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. మెగాస్టార్ ఈ ఛాలెంజ్‌ను ఎలా ఎదుర్కొంటారు? సినిమా ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉండబోతోంది? ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది? అన్నది ఆసక్తిగా మారింది. మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హోప్స్‌తో ఎదురుచూస్తున్నారు

