సినిమా విడుదల కాకముందే పైరసీ ప్రింట్లు బయటకు రావడం, నిర్మాతలకు భారీ నష్టాలు కలగడం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పెద్ద ఆపరేషన్‌లో భారీ పైరసీ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ చర్య కోసం ప్రత్యేకంగా రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునాతన సాంకేతిక పరికరాలను వాడినట్లు వెల్లడించారు.
తాజాగా తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం సినీ ప్రముఖులు మరియు పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై కీలక అంశాలపై చర్చించింది. ఈ సమావేశానికి హాజరైన వారు:
- మెగాస్టార్ చిరంజీవి
- కింగ్ నాగార్జున
- విక్టరీ వెంకటేష్
- నేచురల్ స్టార్ నాని
- అక్కినేని నాగచైతన్య
- నిర్మాత దిల్ రాజు
- ప్రముఖ దర్శకులు
- డిజిటల్ మీడియా కంపెనీల ప్రతినిధులు
ఈ సందర్భంగా పోలీసులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల వ్యవహార శైలిని చూపించి, థియేటర్లలోకి రాకముందే ప్రింట్లు ఎలా లీక్ అవుతున్నాయో వివరించారు.
ప్రత్యేకంగా బెటింగ్ యాప్‌ల నిర్వాహకులే ఈ పైరసీ ముఠాలకు నిధులు సమకూరుస్తున్నారనే సాక్ష్యాలను పోలీసులు బయటపెట్టారు. దీంతో భవిష్యత్తులో ఎటువంటి బెట్టింగ్ యాప్‌ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని టాలీవుడ్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.
అలాగే డిజిటల్ మీడియా కంపెనీలు కూడా తమ సర్వర్లలో సైబర్ భద్రతను మరింత బలపరచాలని హామీ ఇచ్చాయి. మరోవైపు, ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.
సైబర్ క్రైమ్ ఐపిఎస్ అధికారి సివి ఆనంద్ మాట్లాడుతూ, “ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశాం. దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునాతన పరికరాలను వాడి ఈ ఆపరేషన్ చేపట్టాం. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా పట్టుకుంటాం” అని తెలిపారు.

