తండ్రి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన మహేశ్ బాబు – రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ముందు ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈరోజు తన తండ్రి, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్‌లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తోన్న, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన వినూత్న ఈవెంట్ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ విశేష సందర్భంలో తన తండ్రి లేని ఖాళీ మరింతగా అనిపించిందని మహేశ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.

తండ్రితో దిగిన పాత ఫొటోను పంచుకుంటూ, “ఈరోజు మిమ్మల్ని నేను కాస్త ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాను నాన్న… మీరు గర్వపడతారని నాకు తెలుసు” అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో భావోద్వేగపూరిత సందేశాన్ని రాశారు. తన జీవితంలోని అత్యంత కీలక దశలో తండ్రి ప్రోత్సాహం, సాన్నిధ్యం ఎంతగా కావాలనిపిస్తోందో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.

మహేశ్ చేసిన ఈ పోస్ట్ కేవలం కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు ధైర్యం చెబుతూ స్పందిస్తున్నారు. తండ్రి కృష్ణ గారి జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ జీవిస్తున్న మహేశ్ బాబును చూసి నెటిజన్లు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న మహేశ్–రాజమౌళి కాంబినేషన్ చిత్రం గురించి ఈరోజు జరగనున్న ఈవెంట్ ద్వారా మరిన్ని కీలక అప్డేట్లు బయటకు రావచ్చని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *