అనసూయ వ్యాఖ్యలపై రాశి ఫైర్.. పేరు ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఈ వివాదంలోకి సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ కూడా ఎంటర్ కావడంతో చర్చ మరింత ముదిరింది. కొందరు వీరికి మద్దతుగా నిలవగా, మరికొందరు గత వీడియోలు, క్లిప్పులు షేర్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అనసూయ ఓ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఈ క్రమంలో సీనియర్ నటి రాశి ఈ అంశంపై స్పందించి ఫైర్ అయ్యారు. పేరు ఎత్తకుండా, స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాశి.. మైక్ దొరికితే ఏదో ఒకటి మాట్లాడాలని కాదని అన్నారు. శివాజీ మాట్లాడిన మాటలు 100 శాతం తప్పు అని చెప్పలేనని, అనుకోకుండా రెండు పదాలు దొర్లాయని తెలిపారు. ఆ విషయంలో శివాజీ సారీ కూడా చెప్పారని గుర్తు చేశారు.

అదే సమయంలో తన పేరును అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని రాశి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానల్ నుంచి తనకు కాల్ వచ్చి ‘ప్రేయసి రావే’ మూవీ స్కిట్ చేయమని అడిగారని, కానీ కొన్ని ఎపిసోడ్స్‌ను టచ్ చేయకూడదని ముందే చెప్పానని వెల్లడించారు. జడ్జిగా వస్తానేమో కానీ స్కిట్ చేయలేనని స్పష్టం చేశానని తెలిపారు. అయినప్పటికీ ఆ స్కిట్‌ను చేశారు అని చెప్పారు.

రాశిఫలాలు అనే పదం వచ్చినప్పుడు, ఒక యాంకర్ ‘రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా?’ అని అడగడం తనను చాలా బాధించిందని రాశి అన్నారు. “ఒక మహిళగా అలా ఎలా అడుగుతారు? అదే యాంకర్ ఇప్పుడు బాగా నీతులు మాట్లాడుతోంది. రాశిఫలాల్లో నేను లేను. నా పేరు విజయలక్ష్మి. కానీ రాశి గారిలో నేను ఉన్నాను” అంటూ స్ట్రాంగ్‌గా స్పందించారు.

ఆ వ్యాఖ్య వచ్చినప్పుడు అక్కడ ఉన్న జడ్జి కూడా నవ్వారని చెప్పిన రాశి.. తాను ఆ ప్లేస్‌లో ఉంటే ‘ఏంటి ఈ డైలాగ్?’ అని ప్రశ్నించేదాన్నని అన్నారు. కామెడీ చేయొచ్చు కానీ బాడీ షేమింగ్ చేయడానికి ఎవరికీ హక్కు లేదని, కన్న తల్లిదండ్రులకు కూడా ఆ హక్కు ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లీగల్‌గా తీసుకెళ్లాలని అనుకున్నప్పటికీ, తల్లి మాటతో ఆగిపోయానని తెలిపారు.

ప్రస్తుతం రాశి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయను నేరుగా టార్గెట్ చేయకుండా, పేరు ఎత్తకుండా ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *