శీతాకాలంలో వెచ్చదనం కోసం తరచుగా టీ తాగడం సాధారణమే. అయితే ఇంట్లో పెద్దలు టీ తాగుతూ పిల్లలకూ అలవాటు చేయడం మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎదుగుతున్న చిన్నారుల ఆరోగ్యంపై టీ తాగడం తీవ్రమైన ప్రభావం చూపుతుందని ముంబైకి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ నిహార్ దేశాయ్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ — “పన్నెండేళ్లలోపు పిల్లలు టీ తాగితే దుష్పరిణామాలు తప్పవు” అని హెచ్చరించారు. టీ లో ఉండే టానిన్స్ (Tannins) అనే పదార్థం పిల్లలు తీసుకునే ఆహారంలోని ఐరన్, కాల్షియం, ఇతర పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుందని చెప్పారు. దీని ఫలితంగా పిల్లల్లో ఐరన్ లోపం, బలహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయని వివరించారు.
అంతేకాక టీ లోని కెఫీన్ (Caffeine) నాడీ మండల వ్యవస్థను ఉద్దీపన చేసి నిద్రలేమి, ఉద్రేకం, డీహైడ్రేషన్ వంటి సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. పిల్లలకు టీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, పోషక విలువలు లేవని స్పష్టం చేశారు.
చివరగా, టీ ఇవ్వడం బదులు పాలుతో కూడిన డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ లేదా హెర్బల్ పానీయాలు ఇవ్వడం మంచిదని డాక్టర్ దేశాయ్ సూచించారు

