జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ సమన్వయ సమావేశం ఘనంగా ముగిసింది. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు డివిజన్ల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారి సేవలు, ప్రజల పట్ల ఆయన అంకితభావం గురించి నేతలు స్మరించుకున్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ, “మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ప్రజలకు 11 సంవత్సరాల పాటు నిరంతర సేవలు అందించారు. పేదల ఇళ్ల నుండి రిజర్వాయర్ నిర్మాణం వరకు ప్రజల అభివృద్ధికే కృషి చేశారు.” అని పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు పెద్ద నష్టం అని అన్నారు.
తలసాని గారు ప్రజలను ఉద్దేశించి, “ఈ కుటుంబం ఇప్పుడు మీ ముందు ఉంది. మీరు గోపన్న గారిని ఎంతగా ప్రేమించారో, అంతే ప్రేమతో ఆయన కుటుంబాన్ని గెలిపించండి. పోలింగ్ బూత్‌కి వెళ్లేటప్పుడు ఆయనను ఒక్కసారి గుర్తు చేసుకోండి.” అని విజ్ఞప్తి చేశారు.
తన ప్రసంగంలో ఆయన ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. “ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, కానీ జూబ్లీహిల్స్‌లో ఒక్క ఇల్లు కట్టారా? గోపీనాథ్ గారు ఇచ్చిన 3,600 ఇళ్లు గుర్తున్నాయి కదా! కెసిఆర్ గారి పాలనలో విద్యుత్ బిల్లు మాఫీ చేశారు, కానీ ఇప్పుడు ప్రజలపై బలవంతపు బిల్లులు వేస్తున్నారు. మేము ప్రజల వెనుక ఉన్నాం, బిల్లు కట్టకండి.” అని ప్రజలకు ధైర్యం చెప్పారు.
అలాగే ఆయన, “పోలీస్‌లు ఆటో డ్రైవర్లపై, చిన్న వ్యాపారులపై జరిమానాలు వేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది, అభివృద్ధి ఆగిపోయింది. 20 నెలలుగా కాంగ్రెస్ నేతలు కనిపించలేదు, ఇప్పుడు ఉపఎన్నిక దగ్గరగా రాగానే తిరుగుతున్నారు. ప్రజలు చూసి నిర్ణయం తీసుకోవాలి.” అని వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో మాగంటి సునీత గారు, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్‌ఎస్ కీలక నాయకులు పాల్గొన్నారు. సభలో గోపన్న గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన కుటుంబానికి మద్దతుగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు సంకల్పం వ్యక్తం చేశారు.

