డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగుబాటు.. కోటి 46 లక్షల రివార్డు, భారీ ఆయుధాల అప్పగింత

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఉండగా, మిగతా వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా పోలీసులు తెలిపారు.

తెలంగాణకు చెందిన వారిలో దాదాపు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డి జిల్లా ఆరేపల్లికి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్‌తో పాటు అర్బన్ ఏరియా పిడీఎస్యూ సభ్యుడు కనికరపు ప్రభంజన్ ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కంపెనీ ప్లాటూన్ కమిటీ సభ్యుడు, సీపీఐ (మావోయిస్టు) మూడో కమాండర్ మడకం మంగ కర్స లచ్చు, చెర్ల–శబరి ఏరియా కమిటీ సభ్యులు హేమ బుద్రి, ఫ్లాటూన్–33 కమాండర్ ఓయం మంగు, మడకం జోగా, పొండిం వనుగు తదితరులు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.

మొత్తంగా ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా కమిటీ సభ్యులు, 23 మంది పార్టీ సభ్యులు లొంగుబాటయ్యారని డీజీపీ వెల్లడించారు. మిగిలిన మావోయిస్టులు సైతం జనజీవన శ్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు.

లొంగుబాటు సందర్భంగా డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శివధర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ పాసింగ్ పరేడ్ సందర్భంగా ఇచ్చిన పిలుపును గుర్తు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాల విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకం, పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, కొత్త ప్రాంతాలకు పంపడం, స్థానిక ప్రజల మద్దతు లేకపోవడం, పోలీసుల నిరంతర ఒత్తిడి కారణంగానే వారు లొంగిపోయారని వివరించారు.

పునరావాస ప్యాకేజీ కింద డివిజనల్ కమిటీ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, పార్టీ సభ్యులకు రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని తెలిపారు. మొత్తం 41 మందికి కలిపి ప్రభుత్వం తరఫున రూ.కోటి 46 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున అందజేశారు.

లొంగిపోయిన మావోయిస్టుల నుంచి ఒక ఎల్‌ఎంజీ, మూడు ఏకే–47 రైఫిల్లు, ఐదు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్లు, ఏడు ఇన్సాస్ రైఫిల్లు, ఒక బీజీఎల్ గన్, నాలుగు యూబీజీఎల్ తుపాకులు, ఒక 303 రైఫిల్, రెండు సింగిల్ షాట్ రైఫిల్లు, రెండు ఎయిర్ గన్స్‌తో పాటు 733 బీజీఎల్ షెల్స్ సహా భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 21 ఆయుధాలు నిషేధితమైనవని డీజీపీ తెలిపారు.

ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన 54 మంది ఉన్నారని, వీరిలో ఆరుగురు రాష్ట్ర కమిటీలో, 36 మంది సెంట్రల్ కమిటీతో పాటు ఇతర హోదాల్లో పనిచేస్తున్నారని వెల్లడించారు. మార్చి 31 తర్వాత కూడా కేంద్ర బలగాల దాడులు కొనసాగుతాయని తెలిపారు. 2025లో ఇప్పటివరకు 509 మంది సీపీఐ మావోయిస్టు క్యాడర్ లొంగిపోయినట్లు చెప్పారు.

సెంట్రల్ కమిటీలో ఉన్నవారు సైతం జనజీవన శ్రవంతిలో కలవాలని డీజీపీ సూచించారు. ప్రభుత్వం తరఫున పునరావాసం, భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే మరో అగ్రనేత కూడా లొంగిపోనున్నాడని నిఘా వర్గాలు క్లూ ఇచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *